పేదరికం అతని జీవితాన్ని అపహాస్యం చేసింది. కన్న బిడ్డలకు పెళ్లిళ్లు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన దుస్సా రవిశంకర్, దేవి దంపతులు. వీరికి లావణ్య, చందన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు ఓబులేసు అనే కుమారుడూ ఉన్నాడు.రవిశంకర్ ఓ గ్యారేజ్‌లో పనిచేస్తూ వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయడం భారంగా మారింది. కుటుంబ పోషణకే కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కుమార్తెల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానంటూ రోజూ మదనపడేవాడు. తీవ్ర మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.