మదురై జిల్లా అలంగానల్లూర్ సమీపాన అరియూర్‌లోని పట్టత్తరసి అమ్మన్ ఆలయ వీధికి చెందిన సుందర్ (42) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇందుమతి (35), పిల్లలు సునీల్(13), విమల్(9) ఉన్నారు.ఇందుమతి కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇటీవల కన్నుమూసింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన సుందర్ కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. మంగళవారం ఉదయం ఆయన ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అలంగానల్లూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సుందర్‌తో పాటు ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ముగ్గురు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో సుందర్ విషం కలిపిన అరటిపండ్లు పిల్లలకు తినిపించి, తాను కూడా తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అతడికి భార్య అంటే ఎంతో ప్రేమని, ఆమె మరణాన్ని తట్టుకోలేకు సుందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. తాను కూడా చనిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనతోనే విషం తినిపించి వారిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.