Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచుదామనుకునేక్రమంలో కొన్నిసార్లు తల్లిదండ్రులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారుల వయసును, పసి ఆలోచనలను పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు.
అంకెలు నేర్పిస్తూ ఓ తల్లి నాలుగేళ్ల చిన్నారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టిన వీడియో ఒకటి కొన్నినెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయారు. తల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ క్రికెటర్లు కూడా చిన్నారులకు కోపంతో కాదు ప్రేమతో నేర్పిద్దామని ఆ వీడియో షేర్ చేసి సలహాఇచ్చారు. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి దారుణం ఒకటి వెలుగు చూసింది. అబద్ధం చెప్పడానే కారణంతో ఓ దుర్మార్గపు తండ్రి తన పదేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా కొట్టాడు. చిన్న పిల్లవాడు అన్న విచక్షణ కూడా లేకుండా మంచంపై విసిరేస్తూ చితకబాదాడు.
సాధారణంగా తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల్ని అరవడమో, కొట్టడమో చేస్తుంటే రెండో వారు వారికి సర్దిచెబుతూ ఉంటారు. కానీ ఈ ఘటనలో బాలుడి తల్లి కూడా కొడుకుని కొట్టమని తండ్రిని ఉసిగొల్పింది. కన్న కొడుకు గుండెలవిసేలా ఏడుస్తున్నా ఆ పాషాణ తల్లిదండ్రుల హృదయం కరగలేదు. భర్త కొడుకును కొడుతోంటే తల్లి వీడియో తీసింది. ఆ తరువాత ఆ వీడియోను బాలుడికి చూపించి మరోసారి అబద్ధం చెబితే ఇంతకంటే దారుణంగా కొడతామని వారు హెచ్చరించారు. కొన్ని రోజుల తర్వాత బాలుడితల్లి తన ఫోన్ ను స్థానిక మొబైల్ షాప్ లో రిపేర్ కు ఇచ్చింది. ఫోన్ బాగుచేసే క్రమంలో ఈ వీడియో చూసిన షాపు యజమాని వెంటనే ఎన్జీవోకు, పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాలుడిని విచక్షణారహితంగా కొట్టినందుకు గానూ తండ్రిని పోలీసులు జువైనల్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. బాలుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై ప్రముఖ టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుడిని కొడుతున్న వ్యక్తి వివరాలు సేకరించి తనకు చెబితే అతన్ని ఇంతకంటే దారుణంగా చావగొడతానని మండిపడ్డారు. ఫేస్ బుక్ లో ఈ వీడియో షేర్ చేసిన సుధీర్ బాబు….
ప్లీజ్…అతను ఎక్కడుంటాడో కనుక్కోండి. ఇంతకంటే దారుణంగా వాడిని చావగొడతాను. అతనో తండ్రి అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అని వ్యాఖ్యానించారు.