స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. దీంతో నిఫ్టీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన మరుసటి రోజే సెన్సెక్స్‌ కూడా అదే పని చేసింది. 54,000 వేల పాయింట్లను బుధవారం అవలీలగా దాటేసింది.బాంబే స్టాక్‌ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్‌ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. నెలన్నర రోజుల్లో తన ఖాతాలో మరో వెయ్యి పాయింట్లు జమ చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50వేల మార్క్‌ని దాటిన సెన్సెక్స్‌ జూన్‌ 22న సెన్సెక్స్‌ పాత రికార్డులు బద్దలు కొడుతూ 53 వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. ఆ తర్వాత 54 వేలు చేరడానికి కేవలం 30 సెషన్లు మాత్రమే తీసుకుంది.

బుధవారం ఉదయం మార్కెట్‌ ప్రారంభమైంది మొదలు సెన్సెక్స్‌ సూచీ పైకి చేరుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 546 పాయింట్లు లాభపడి 54,369 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఓ దశలో 54,465 గరిష్ట పాయింట్లకు చేరుకుంది. నిన్న పదహారు వేల మార్క్‌ని క్రాస్‌ చేసిన నిఫ్టీ ఈ రోజు కూడా అదే ట్రెండ్‌ కొనసాగించింది. మార్కెట్‌ క్లోజ్‌ అయ్యే సమయానికి 122 పాయింట్లు లాభపడి 16,253 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.జూన్‌ నెలలో వివిధ కంపెనీలు ప్రకటించిన క్వార్టర్‌ ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో మార్కెట్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది.

కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు వ్యాపారాలు పుంజుకున్నాయి. మరోవైపు కోవిడ్‌ వ్యాప్తి కంట్రోల్‌లోనే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపించారు.హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుల షేర్లు లాభాలు పొందగా టైటాన్‌, నెస్టల్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ కంపెనీలు సెన్సెక్స్‌లో నష్టాలు పొందాయి. మరోవైపు మార్కెట్‌లో బుల​ట్రెండ్‌ కొనసాగుతుండటంతో స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు లాభపడ్డాయి.