కరోనా వైరస్ వ్యాపించడాన్ని అరికడుతూ.. లాక్ డౌన్ పాటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు హీరోలు ఇచ్చిన విరాళంపై అభిమానుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఆ గొడవ పెద్దదై ఓ యువకుడి ప్రాణాన్ని బలికొన్నది. తమ హీరో అంటే.. తమ హీరో గొప్ప అంటూ పోట్లాడుకున్న అభిమానుల్లో ఒకరు హత్యకు గురయ్యాడు. ఈ ఘోరమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అసలే లాక్ డౌన్ కష్టాలతో అలమటించి పోతున్న పేదల్ని ఆదుకొనేందుకు ప్రభుత్వం విరాళాల్ని సేకరించే పనిలో పడింది. సీఎం పళని స్వామి పిలుపుతో స్పందించి సాయం అందిస్తున్నారు. సినీ రంగ ప్రముఖులు కూడా అందుకు సహకరిస్తున్నారు. అయితే.. అభిమానులు తమ హీరో సినిమా అంటే.. తమ హీరో సినిమా సూపర్ పైపైకి మాట్లాడుకోవడం.. అభిమానాన్ని చాటుకోవడ మాత్రమే ఇప్పటివరకు చూశాం కానీ.. కొత్తగా ప్రాణాలను తీసుకోవడం తాజాగా చూస్తున్నాం.
అసలు ఏం జరిగింది అంటే… విల్లుపురం జిల్లా మరక్కానంకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి హీరో విజయ్ వీరాభిమాని. అతడి మిత్రుడు దినేష్ బాబు రజనీకాంత్ వీరాభిమాని. మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు హీరోల విషయంలో శత్రువులుగా మారారు. తాజాగా ఇద్దరి మధ్య కరోనా విరాళంపై భారీస్థాయిలో గొడవ జరిగింది. తమ హీరో అంటే.. తమ హీరో ఎక్కువ మొత్తం ఇచ్చాడని.. సేవలు చేయిస్తున్నాడంటూ వాదులాటకు దిగారు. ఇంతలో ఆగ్రహంతో రెచ్చి పోయిన దినేష్ బాబు యువరాజ్‌ను గట్టిగా నెట్టేయడంతో కింద పడ్డాడు. దీంతో తలకు బలంగా దెబ్బతగిలింది. బలమైన దెబ్బ కారణంగా యువరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనతో షాక్‌కు గురైన దినేష్ బాబు అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న మరక్కానం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువరాజ్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ఆస్పత్రికి తరలించారు. అయితే దినేష్ బాబును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.