Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విచారణ క్రమంలో పోలీసులు నిందితులను అనేక రకాలుగా హింసిస్తారన్నది తెలిసిన సంగతే. అయితే నేరాల తీవ్రతను బట్టి పోలీసుల విచారణ తీరు సాగుతుంటుంది. క్రూరమైన నేరాల్లో ప్రమేయమున్న నిందితులతో నిజం చెప్పించేందుకు, నేరాన్ని అంగీకరింపచేసేందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటారు. ఈ విధానాన్ని ఎవరూ ప్రశ్నించరు కానీ… చిన్న చిన్న నేరాల నిందితులపై కూడా పోలీసులు కొన్నిసార్లు జులుం ప్రదర్శిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ మానవహక్కులకు విఘాతం కల్పిస్తుంటారు. దొంగతనం, దాడి వంటి కేసుల్లో చిక్కుకుని పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినేవారెందరో. దీనిపై ఎన్ని నిరసనలు వ్యక్తమయినా… పోలీసుల తీరులో మార్పురావడం లేదు. సాధారణంగా కానిస్టేబుల్లు, ఎస్సైలు ఇలా క్రూరంగా వ్యవహరిస్తుండడం చూస్తుంటాం. డీసీపీ, డీఎస్పీ, ఎస్పీ వంటి పై స్థాయి అధికారులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ సైబరాబాద్ డీసీపీ గంగిరెడ్డి మాత్రం ఓ సాధారణ కేసులో ఇలా అనుచితంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…
గచ్చిబౌలిలోని హిల్ డ్రీజ్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న హారిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. నటనపై ఆసక్తి ఉండడంతో ఆమె పార్ట్ టైంలో షార్ట్ ఫిలింస్ లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షార్ట్ ఫిలింస్ దర్శకుడు యోగి పరిచయమయ్యాడు. ఓ సందర్బంలో డబ్బు అవసరమై యోగీ హారిక వద్ద రూ. 10వేలు తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో హారిక యోగీని గట్టిగా నిలదీసింది. దీంతో యోగీ హారిక సెల్ కు అసభ్యకరమెసేజ్ లు పంపిస్తూ వేధిస్తున్నాడు. యోగీ తీరుపై హారిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న షీ టీమ్ ఇన్ చార్జ్, అదనపు డీసీపీ గంగారెడ్డి శుక్రవారం రాత్రి యోగిని పిలిచి గంటన్నరసేపు విచారణ జరిపారు. ఈ క్రమంలో మిగిలిన పోలీసులు అందరూ చూస్తుండగానే గంగిరెడ్డి యోగిపై దారుణంగా ప్రవర్తించారు. యోగిని బూటుకాలితో తన్ని చెంపలపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో టీవీ చానళ్లలో ప్రసారమై సంచలనం సృష్టిస్తోంది. గంగారెడ్డి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇంత హేయంగా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు ఈ వివాదంపై యోగి స్పందించాడు. తాను హారికను ఏ రోజూ వేధించలేదని, కేవలం పదివేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఈ గొడవకు కారణమని తెలిపాడు. గతంలో హారిక తన వ్యక్తిగత విషయాలు తనతో షేర్ చేసుకునేదని, ఆ విషయాలు మరో వ్యక్తి కారణంగా బయటికి రావడంతో, తానే ఆ విషయాలను బయటపెట్టానని కోపం పెంచుకుందని యోగి చెప్పాడు. తన పరువు తీస్తానని బెదిరించిందని, ఇండస్ట్రీలో తన సన్నిహితులకు ఫోన్ చేసి తనపై చెడుగా చెప్పేదని ఆరోపించాడు. తన మీద తప్పుడు ప్రచారం ఆపేస్తేనే పదివేల రూపాయలు తిరిగిస్తానని చెప్పానన్నాడు. హారికతో తానెప్పుడూ కలిసి పనిచేయలేదని, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం అయిందని తెలిపాడు. హారికకు తాను అసభ్య మెసేజ్ పంపిన మాట నిజమేనని, ఆమె రెచ్చగొట్టడం వల్లే అలా చేశానన్నాడు. డీసీపీ గంగిరెడ్డి తనను కొడుతున్న వీడియోను కూడా హారికనే షూట్ చేసి తన స్నేహితులకు షేర్ చేసిందని తెలిపాడు.