తీవ్ర స్థాయిలో మండిపడ్డ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తీవ్ర స్థాయిలో మండిపడ్డ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాష్ట్రంలో శివరామకృష్ణ కమిటీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నారాయణ కమిటీని వేసిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పట్టాణాభివృద్ధిలో పీహెచ్‌డీలు చేసిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించామని సభలో తెలిపారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు.

‘విభజన అనంతరం ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, అప్పులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వరద వస్తే 70 శాతం అమరావతి మునిగిపోయే అవకాశం ఉందని, దూర ప్రాంతాల నుంచి ప్రజలు అమరావతికి రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని మూడు కమిటీలూ తేల్చిచెప్పాయి. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టారు. వ్యవసాయం మీద మన రాష్ట్రం ఆధారపడి ఉంది. ఐదేళ్లలో 66 వేలకోట్లు రెవిన్యూ లోటు వచ్చింది. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు నిర్మించగలమా?. భావితరాలు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది’ అని అన్నారు.