యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది తొలి ఒమిక్రాన్ వేరియంట్ మరణం కావడంతో యూకేలో అలజడి మొదలైంది. ఒమిక్రాన్ తీవ్రంగా విస్తరిస్తున్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. బ్రిటీష్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో యూకేలో దాదాపు 663 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్లో మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 1898కి చేరుకుంది.
నిపుణుల అంచనా ప్రకారం.. ఇదే విధంగా మహమ్మారి ఉధృతి కొనసాగితే ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తోంది. కాగా యూకే జనాభాలో 12 యేళ్లకు పైబడిన 81 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్లు వేయడం పూర్తయ్యింది. ఏది ఏమైనప్పటికీ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ మాత్రం.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ కారణంగా 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.