ప్రముఖ భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. కస్టమర్లు పాత ఫోన్లను అమ్మేందుకు ఓ ప్రత్యేక పద్ధతిని తెచ్చింది. సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు.. వారి పాత ఫోన్లను విక్రయించవచ్చని ఫ్లిప్‌కార్ట్ సోమవారం వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్ రీకామర్స్ కంపెనీ యంత్ర ను ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్.. ఇందులో భాగంగానే సెల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పాత మొబైల్‌ను అమ్మి, ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ వౌచర్ను పొందవచ్చు. ఎలా విక్రయించాలి.. ప్రాసెసస్ ఏంటి.. అనే వివరాలు చూడండి.
“ఫ్లిప్‌కార్ట్ సెల్ బ్యాక్ ప్రోగ్రామ్‌తో రీకామర్స్ మార్కెట్‌ను ఆర్గనైజ్ చేయడమే మా లక్ష్యం. భారత కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ వేస్ట్‌ను తగ్గించేందుకు కూడా ఈ సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా కృషి చేస్తాం. స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు ఇది తోడ్పడుతుంది” అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రోత్ చార్టర్ హెడ్ ప్రకాశ్ షికారియా చెప్పారు.
సెల్ బ్యాక్‌లో భాగంగా ప్రజలు.. ఏ మొబైల్‌నైనా అమ్మవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అయినా.. వేరే చోట కొనుగోలు చేసిన ఫోన్లనైనా ఈ కార్యక్రమంలో భాగంగా విక్రయించవచ్చు. ప్రస్తుతం మొబైళ్లకే ఉన్న ఈ సదుపాాయాన్ని త్వరలో ఇతర కేటగిరీలకు కూడా తెస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్ నగరాలతో పాటు దేశవ్యాప్తంగా 1,700 పిన్కోడ్స్లకు ప్రస్తుతం ఈ సెల్ బ్యాక్ సదుపాయం ఉంది.మొబైల్‌ను విక్రయించాలనుకున్న వారు ముందుగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
అనంతం కిందభాగంలో ఉండే బాటమ్‌బార్‌లో మెనూపై క్లిక్ చేసి సెల్ బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత అమ్మాలనుకుంటున్న ఫోన్‌కు సంబంధించి వచ్చే 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.కన్ఫార్మ్ చేసిన తర్వాత 48 గంటలలోపు ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటివద్దకే వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకుంటారు.వెరిఫికేషన్ పూర్తైన కొన్ని గంటల్లో ఫోన్ వాల్యూ ఎంతవుతుందో అంత మొత్తంతో కూడిన ఫ్లిప్‌కార్ట్ వౌచర్ కస్టమర్‌కు జారీ అవుతుంది. అయితే విక్రయించే ముందు ఫోన్ సెల్ బ్యాక్ వాల్యూను చెక్ చేసుకోవాలి.
ప్రస్తుతం భారత్‌లో సెకండ్ హ్యాండ్ మొబైల్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రూ.వేలకోట్లలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారం జరుగుతోంది.2013లో మొదలైన Yaantra.. పాత ఫోన్లను కొనడంతో పాటు మొబైల్ రిపేర్ సర్వీస్‌ను కూడా అందిస్తూ వృద్ధి చెందింది. అలాగే ఇంటివద్దకే మొబైల్ సర్వీస్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో పాటు ల్యాప్‌టాప్ రిపేర్ సర్వీస్ కూడా చేస్తోంది. దీంతో రిఫర్బిష్డ్ ప్రొడక్టుల విభాగంలో Yaantra వేగంగా ఎదిగింది. ఈ క్రమంలో ఈ రీకామర్స్ సంస్థను ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఈ సంస్థను కొనుగోలు చేసింది.