హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలలోని పలు కాలనీలు నీట మునిగాయి. చాలా ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మొన్న వర్షం కాస్త బ్రేక్ ఇచ్చి నేడు మళ్ళీ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
అయితే తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన ఇంటి పరిస్థితి ఇది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తుంటే వారి కాలనీ మొత్తం జలమయం అయినట్టు కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలను ఉద్దేశిస్తూ బ్రహ్మాజీ మోటర్ బోట్ కొనాలనుకుంటున్నా, ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి అంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.