కృష్ణకు పోటెత్తిన వరద…బాబు నివాసం మునుగిపోయే అవకాశం 

Flooding of Krishna ... Babu's residence likely to sink

చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు కరకట్టపై అక్రమంగా నిర్మించారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అక్రమ కట్టడంలో నివాసముండి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.

చంద్రబాబును ఆ నివాసం నుంచి ఖాళీ చేయిస్తామని పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల తర్వాత పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ చంద్రబాబు నివాసాన్ని ముంచేసేలా కనిపిస్తోంది. 2009లో భారీ వరదల తర్వాత కృష్ణా నదిలో ఆ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేసి నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అధికారులు 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పులిచింతల నుంచి వస్తున్న నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద జలకళ సంతరించుకుంది. నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుండటంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. కరకట్ట సమీపంలో నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే వరద చేరుతోంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ మెట్ల వరకు వరద నీరు చేరుకుంది. పులిచింతలకు వరద నీరు వస్తోందని, అక్కడి నుంచి 6లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కృష్ణా నది కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం అవుతోంది.