జగన్ సర్కార్‌ కు షాకిచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ !

polavaram-project-authority-shock-to-jagan-sarkar
జగన్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. పోలవరం టెండర్ల విషయంలో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రాజెక్ట్ అథారిటీ పరోక్షంగా తప్పుబట్టింది. నిన్న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ ఏసీ గార్డ్స్‌లో అత్యవసరంగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ.. ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుతో పాటూ పలు కీలక అంశాలపై చర్చించింది.
అనంతరం మాట్లడిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్కే జైన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అన్నారు జైన్. ఈ ప్రభావంతో నిర్మాణంలో కూడా ఆలస్యం జరిగే అవకాశముందని అన్నారు.
పోలవరం కాంట్రాక్ట్ ఏజెన్సీల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్న ఆయన రివర్స్‌ టెండరింగ్‌తో ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అభిప్రాయపడ్డారు.
పోలవరం టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మధ్యే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి జరిగిందని.. తాము రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై కేంద్రం కూడా స్పందించింది.
పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు బాధాకరమైన విషయమని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. తాజాగా పోలవరం అథారిటీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.