తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో నేడు ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఎకగ్రీవ ఎన్నికలు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ విధానం, నోటా (NOTA) ఎంపిక, ఓటర్ల తుది జాబితా ఖరారు వంటి కీలక అంశాలపై ప్రధానంగా అభిప్రాయాలను స్వీకరించనున్నారు.
ఏకగ్రీవాలకు బ్రేక్? నోటా కీలకం
ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు చోటు చేసుకునేవి. ముఖ్యంగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోటీ లేకుండానే అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం నోటా (NOTA) ద్వారా ఈ ప్రక్రియకు బ్రేక్ వేయాలనే చర్చ నడుస్తోంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైనచోట ఓటర్లు అభ్యర్థికి వ్యతిరేకంగా నోటా బటన్ నొక్కే అవకాశాన్ని కల్పించాలని ప్రతిపాదన ఉంది.
ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేయాలా? లేదా? అనే అంశంపై ఈరోజు జరిగే సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేస్తే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పోటీ పెరిగే అవకాశం ఉంది.
కలెక్టర్లతో సమావేశం – రిజర్వేషన్ల ఖరారు
ఇక మరోవైపు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో కూడా ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. MCHRD లో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ గురించి అవగాహన కల్పించనున్నారు. పANCHAYAT RAJ శాఖ ఇప్పటికే ఈ కసరత్తును పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. రెండు నాలుగు రోజుల్లో రిజర్వేషన్లను ఫైనల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీసుకోబోయే కీలక నిర్ణయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.