బలవంతంగా అబార్షన్‌ మాత్రలు.. యువతి మృతి

forced abortion pills

ఓ యువతిని అనేకసార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెకు బలవంతంగా అబార్షన్‌ మాత్రలు మింగించాడు. ఆ మాత్రలు వికటించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్వాలి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కథనం ప్రకారం.. ఈ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ యువతికి ఇంటి పక్కనే కుర్రాడు మాయమాటలు చెప్పి.. అనేకసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు.. అబార్షన్‌ చేయించుకోవాలని డిమాండ్‌ చేశాడు.

ఇందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో బయటకు వెళ్దామని చెప్పి.. ఆమెను కమల్‌గంజ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా అబార్షన్‌ మాత్రలు మింగించాడు. కొద్ది క్షణాల్లోనే యువతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో యువతిని కమల్‌గంజ్‌ క్రాస్‌రోడ్డు వద్ద వదిలేసి యువకుడు పరారీ అయ్యాడు. స్థానికులు యువతిని గమనించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు