Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ మిత్రదేశం ఎవరు అనగానే చిన్నపిల్లలు సైతం టక్కున చైనా పేరు చెప్పేస్తారు. పాక్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందని ప్రపంచం మొత్తం ఆరోపిస్తున్నా… చైనా మాత్రం ఆ దేశాన్ని వెనకేసుకొస్తూనే ఉంటుంది. అంతేకాదు… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాక్ ఎన్నో త్యాగాలు చేస్తోందని కూడా అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చైనా ఆ దేశాన్ని సమర్థించుకుంటూ వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య మిత్ర బంధానికి ఏకైక కారణం భారత్ పై వ్యతిరేకతే అన్న సంగతి అందిరకీ తెలుసు. భారత్ ను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేందుకు చైనా తొలినుంచీ… పాకిస్థాన్ ఏం చేసినా ఆ దేశాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. అలాంటిది తొలిసారి చైనా స్వరంలో మార్పు వచ్చింది. ఇటీవల భారత్ జపాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో భయపడిందో లేక నిజంగానే చైనా వైఖరిలో మార్పు వచ్చిందో తెలియదు
కానీ… ఐక్యరాజ్యసమతిలో పాక్ చేసిన ఓ డిమాండ్ ను చైనా ఎలాంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. కాశ్మీర్ కు ఒక ప్రత్యేక దౌత్యవేత్తను నియమించాలని పాక్ ప్రధాని అబ్బాసీ ఐక్యరాజ్యసమితిని కోరారు. ఐరాసలో పాక్ ఎప్పుడు ఏ డిమాండ్ చేసినా… దానికి మద్దతు తెలిపే చైనా… ఈ సారి మాత్రం పాక్ కోరికను మన్నించలేదు. కాశ్మీర్ విషయంలో చైనా విధానం పూర్తి కచ్చితంగా ఉందని, భారత్, పాక్ లు సరైన విధానంలో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూకింగ్ పాకిస్థాన్ కు హితవు పలికారు. కాశ్మీర్ విషయంలో చైనా తలదూర్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జపాన్ తో భారత్ మితృత్వంతో పాటు… ఇటీవల పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికా కూడా తీవ్ర విమర్శలు చేస్తుండడంతో చైనా వైఖరిలో మార్పు వచ్చిందని భావిస్తున్నారు.