టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద అటవీ కేసు

Forest Case on TRS MLA

అటవీశాఖ అధికారులను బెదిరించి వారి విధులకు అటంకం కలిగించారనే కారణం మీద  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు రాఘవేందర్‌ లతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. స్థానిక ఎమ్మెల్యేపై అటవీశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. లక్ష్మీదేవి మండలంలోని ఇల్లందు క్రాస్‌రోడ్డు సమీపంలో చాతకొండ సెక్షన్ పరిధిలోని లోతువాగు బీట్‌లో కంపార్ట్‌మెంట్ నెంబర్‌లో 2 రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉందని, ఈ భూమి రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మించేందుకు గత నెల 29న గుంతలు తవ్వుతుండగా స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయను కుమారుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపిటీసి పూనెం శ్రీను, ఖానుముద్దీన్, లింబ్యాలు తదితరులు మొత్తం 80 మంది రైతులతో కలిసి వచ్చి అడ్డుకున్నారు. పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి మాటలను అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అక్కడ ఉన్న అటవీ శాఖ సబ్బందిని దూషిస్తూ వారి మీద దాడి చేయాలంటూ రైతులను ఉసిగొల్పారని అటవీ శాఖ డిఆర్‌ఓ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని బీట్ అధికారి తనకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారని వెంటనే తాను అక్కడికి వెళ్ళగా అప్పటికే వనమా వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు తమ సిబ్బంది తవ్విన గోతుల పూడ్పించారని, ఫోనులో తనను బెదిరించారని డిప్యూటి రేంజ్ అధికారి ఎఆర్‌పి రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటలు పూడ్చటం ద్వారా అటవీ శాఖకు రూ.50 వేల నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వనమా వెంకటేశ్వరరావు, ఆయను కుమారుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపిటిసి పూనెం శ్రీను, ఎస్‌కే ఖానుముద్దీన్, భూక్యా లింబ్యాలపై తగు చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. దీంతోలక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ నరేష్ వనమా వెంకటేశ్వరరావు, కుమారుడు రాఘవేంద్రరావు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, బెదిరించి, ఆస్థి నష్టం కలిగించి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంటకం కలిగించారని ఆరోపిస్తూ సెక్షన్ ఐపిసి 143, 447, 427, 506, 353, సెక్షన్ 3 ఆఫ్ పిడిపిపి యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.