మాజీ సీఎం అంజయ్య దళితుడు కాదు అసలు పేరు రామకృష్ణారెడ్డి ?

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతోపాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రతాప్‌ గఢ్ సభలో మోదీ మాట్లాడుతూ రాజీవ్ జీవితం అవినీతిలో నెం.1‌గా ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌పై విమర్శలు గుప్పించడమే కాదు, దళితుడైన ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్ ఘోరంగా అవమానించారని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై అంజయ్య మనవడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ సెక్రెటరీ అభిషేక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంజయ్యను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే ‘దళితుడు’ అని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అభిషేక్‌రెడ్డి తెలిపారు. దళితుడు అయినందుకే అంజయ్యను నాటి ప్రధాని రాజీవ్‌ విమానాశ్రయంలో అవమానించారని పార్లమెంటు సాక్షిగా మోదీ వ్యాఖ్యానించారని, ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందడానికే మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, దళితుడు కాదని పలుమార్లు వివరణ ఇచ్చినా ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎయిర్‌ పోర్టులో అవమానించలేదని, ప్రధాని పదవిలో ఉండి ప్రజలకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.