గన్ పెట్టి మరీ కోడలి మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే రేప్  

former-bjp-mla-put-the-gun-raped-over-kodali

బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై ఆయన కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మద్యం మత్తులో మామ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత అతడు తనపై బలత్కారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపారు. కోడలి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే మనోజ్‌ షోకీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్‌ షోకీన్‌ ఢిల్లీ బీజేపీకి చెందిన కీలక నేత.

నంగ్లోయ్‌, ముంద్కా నియోజకవర్గాల నుంచి ఆయన ఒక్కో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఆగ్రహజ్వాలలు కొనసాగుతుండగానే మరో రేప్ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.

తన కుటుంబం పరువు పోతుందని.. సోదరుడికి వివాహం కావాల్సి ఉందనే ఉద్దేశంతో తనపై జరిగిన దారుణం గురించి ఇన్నాళ్లుగా ఎవరికీ చెప్పలేదని బాధితురాలు వెల్లడించారు.

అత్తామామలు తనను తీవ్రంగా వేధించేవారని ఫిర్యాదు చేశారు. అత్యాచారం, గృహ హింస నేరారోపణలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.