ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య భారతిని చేర్చుతూ ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భారతీ సిమెంట్స్ కేసులో భారతిని నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడం పై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై నిన్న సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన బహిరంగ లేఖ వివాదాస్పదంగా మారింది. అయితే . వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జాయిండ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వైఎస్ భారతి మీద నమోదయిన కేసు గురించి స్పందించారు.
విశాఖపట్నం జిల్లా చోడవరంలో ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా?’ అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని ఆయన నిర్వహించారు. వైఎస్ భారతిపై ఈడీ కేసు గురించి ఈ సందర్భంగా లక్ష్మీనారాయణను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు గురించి నాకేం తెలియదు.’’ అని బదులివ్వడం గమనార్హం. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన, ఏ పార్టీలోకి అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.