Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూజిలాండ్ తో రెండో టీ20లో భారత్ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుర్రాళ్ల ఉరిమే ఉత్సాహానికి వేదికగా ఉండే టీ20ల నుంచి 36 ఏళ్ల ధోనీ తప్పుకుంటే బాగుంటుందన్న సలహాలు వినపడుతున్నాయి. మూడేళ్ల క్రితం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ వన్డేలు, టీ20లను మాత్రం విశ్రాంతి లేకుండా ఆడుతున్నాడు. మూడు నుంచి ఏడో నెంబర్ లోపు ఏ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా… భారత్ ఖాతాలో విజయాన్ని నమోదుచేసే ధోనీలో ఇప్పడు ఆ స్థాయి ప్రతిభ కనిపించడం లేదన్నది నిజం. ముఖ్యంగా టీ20ల్లో కుర్రాళ్లంతా వేగంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అయితే ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్ చేసినా… ఆ మ్యాచ్ లో భారత్ గనక విజయం సాధిస్తే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. అలాగే భారత్ తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు వేగంగా బ్యాట్ ఝళిపించకపోతే పెద్దగా నష్టం ఉండేదికాదు.
కానీ న్యూజిలాండ్ తో రెండో టీ20లో ధోనీ లక్ష్యాన్ని చేధించాల్సిన సమయంలో… దూకుడుగా ఆడకుండా… నెమ్మదిగా ఒక్కో పరుగు చేయడం, ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో ఇప్పుడు అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ధోనీ గురించి ఏదో ఒక మాట మాట్లాడడానికి ఇప్పుడు అందరూ కాచుక్కూర్చున్నారు. భారత క్రికెట్లో ధోనీ హవా ముగిసిపోయినట్టే. ఇప్పుడు అతనికి బ్యాడ్ పీరియడ్ నడుస్తుందనే చెప్పాలి. అందుకే ఒక్క మ్యాచ్ లో విఫలమయినా… అందరూ అతన్ని వేలెత్తిచూపిస్తున్నారు. టీ 20ల నుంచి తప్పుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఎప్పుడూ ఎవరిపై అంతగా విమర్శలు చేయని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధోనీ స్ట్రైక్ రేట్ గురించి ప్రస్తావించి అతను టీ20ల్లో కుర్రాళ్లకు అవకాశమివ్వాలని వ్యాఖ్యానించడం, దానికి అజిత్ అగార్కర్ మద్దతు పలకటం తీవ్ర సంచలనం సృష్టించింది.
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దాదాపుగా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశాడు. టీ20లు ఆడేటప్పుడు జట్టులో తన పాత్ర ఏమిటో యాజమాన్యం ధోనీకి స్పష్టంగా చెప్పాలని, జట్టులో తన పాత్రేంటో ధోనీ తెలుసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు ఆరంభం నుంచే జోరందుకోవాలని, తొలి బంతినుంచే ధాటిగా ఆడాలని, ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం అతనికి అర్ధమయ్యేలా చెప్పాలని వీరూ వ్యాఖ్యానించాడు. ఏ దురుద్దేశం లేనప్పటికీ ఆ మాటలు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నామన్న మాట నిజం. ఎందుకంటే… పన్నెండేళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతూ… టీమిండియాను అన్ని ఫార్మట్లలోనూ నెంబర్ వన్ గా నిలిపి, భారత కలలన్నీ నిజం చేసిన ధోనీకి ఏ మ్యాచ్ లో ఎలా ఆడాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. తన బాధ్యతలను ఒకరు చెప్తే తప్ప అర్ధంచేసుకోలేని స్థితి కాదు ధోనీది. కానీ… ధోనీని జట్టుకు అదనపు భారంగా భావిస్తున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతుండడంతో… మాజీలంతా తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.
నిజానికి సీనియర్లు టీ20లకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటిది కాదు. ఆ తరహా మ్యాచ్ లు ప్రారంభమైన కొత్తలోనే అన్ని దేశాల ప్లేయర్ల విషయంలో ఈ అభిప్రాయం వ్యక్తమయింది. టీ20 కుర్రాళ్ల ఆటగా గుర్తింపుపొందింది. ఆ అభిప్రాయం గతంలో ధోనీకి లాభించింది. తొలి టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ధోనీకి రావడానికి కారణం అప్పటికి టెస్ట్, వన్డేల కెప్టెన్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్… టీ 20లు ఆడనని ప్రకటించడం వల్లే. ద్రవిడ్ నిర్ణయం వల్ల అప్పటి సీనియర్ ఆటగాళ్లు సచిన్, గంగూలీ, కుంబ్లే లాంటి వారు సైతం టీ20లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వరల్డ్ కప్ కు ధోనీని కెప్టెన్ గా ఎంపికచేశారు సెలెక్టర్లు. అలా ఒకప్పుడు ధోనీకి లాభించిన నిర్ణయయే ఇప్పుడు అతని కెరీర్ కు ముగింపు పలకాల్సిన స్థితి కల్పించడం యాదృచ్ఛికం.