కాంగ్రెస్ కు దానం దెబ్బ, కారెక్కుతారా ?

former minister danam Nagender resigns congress ready to join trs

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ టీఆరెస్ పార్టీ బలంగా ఉంది. మిగులు బడ్జెట్ తో నడుస్తుండడంతో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. రానున్న ఎలక్షన్ లో ఆ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రతిపక్ష నాయకులే చెప్పడం తెలంగాణా రాజకీయ పరిస్థితి తెలియచేస్తోంది. ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఎవరు ఊహించని విధంగా రాజీనామా చేసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాడు. రాజీనామాకు గల కారణాలను విశ్లేషిస్తూ ఏఐసీసీకి ఆయన లేఖ రాశారు. రాజీనామాకు గల కారణాలను రేపు మీడియా ముందు వెల్లడిస్తానని నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, తెలంగాణ పరిశీలకుడు అశోక్‌ గెహ్లాట్‌, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకు కూడా లేఖలు రాశారు. పార్టీలో బడుగులు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు దానం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.

కాగా, ఇటీవలే సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పదవిని కోల్పోయినప్పటి నుంచీ దానం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. రాజీనామా వార్తలు ప్రసారమైన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ దానం ఇంటికి వెళ్లి, సముదాయించే ప్రయత్నం చేశారు. 2015 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. గతంలో దానం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన్ను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ భవన్ చుట్టూ దానం ప్లెక్సీలు కూడా పెట్టారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. దానం తన సిటీ ప్రెసిడెంట్‌ పదవిని మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌కు కాంగ్రెస్ కట్టబెట్టడంతో ఇంకాస్త కుంగిపోయారని తెలిసింది. అదేసమయంలో అధికార పార్టీ నుంచి భారీ ఆఫర్‌ రావడంతో ఆయన గులాబీ గూటిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ భారీ ఆఫర్‌ ‘సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌’ అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.