కొణతాల రాజకీయ వనవాసం సమాప్తం ?

former-minister-konathala-ramakrishna-padayatra-for-vizag-railway-zone

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది అక్షర సత్యం. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువ. రాష్ట్ర విభజన అనే ఒకే ఒక్క దెబ్బతో మహామహులనుకున్న రాజకీయ నేతలు చోటామోటా నేతలుగా మిగిలిపోయారు. స్థాయికి తగ్గ అవకాశం వస్తుందని ఎదురు చూసీ చూసీ తమ వైభవం గతమని కాస్త ఆలస్యంగా అర్ధం చేసుకున్నారు. అయితే కొత్త పార్టీ లోకి వెళ్ళడానికి నానా అగచాట్లు పడుతున్నారు. నిర్ణయం తీసుకోడానికే చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ కోవలో నేత ఒకరు కొణతాల రామకృష్ణ. ఒకప్పుడు ఎంపీ, రాష్ట్ర మంత్రి, వై.ఎస్ ముఖ్య అనుచరుల్లో ఒకరు. వైసీపీ లో చేరి ఆ పార్టీకి దూరమైన నాయకుడు. ఆ తర్వాత ఇంకో పార్టీలో చేరకుండా దాదాపు మూడేళ్లు అలా ఉండిపోయారు. ఓ సీజన్డ్ రాజకీయ నాయకుడు ఇలా మూడేళ్ళ పాటు ఏ ప్రధాన రాజకీయ పక్షంలో లేకుండా ప్రజల్లో నిలబడడం అంటే కత్తి మీద సామే. అందుకే కొణతాల కూడా ఉత్తరాంధ్ర సమస్యల మీద పోరాటం బాధ్యత భుజాన వేసుకున్నారు. విశాఖ కి రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకం మీద దృష్టి పెట్టారు. పాదయాత్ర, ఇంకా వివిధ మార్గాల్లో జనంలోకి వెళ్లారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అందర్నీ టార్గెట్ చేశారు.

అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసాక కొణతాల స్వరంలో మార్పు వచ్చింది. ఇన్నాళ్లు ఆయన టీడీపీ లో చేయడానికి అవరోధంగా వున్న స్థానిక రాజకీయ సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. అంత కన్నా పెద్ద మ్యాటర్ ఏపీ సర్కార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి 2022 కోట్లు మంజూరు చేస్తూ 535 నెంబర్ జీవో కూడా విడుదల చేసింది. ఒకప్పుడు ఈ పధకానికి వై.ఎస్ హయాంలో 50 కోట్లు మంజూరు అయ్యాయి.ఆ తర్వాత ఈ పధకం మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిధులు మంజూరు చేయడం మీద కొణతాల సంతృప్తి చెందడమే కాకుండా సీఎం ని పొగుడుతూ మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే మూడేళ్ళ రాజకీయ వనవాసం తర్వాత కొణతాల పచ్చ జెండా చెంతకి చేరబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.