సీకే కి గొడుగు పడితే బీజేపీ కి ఏమి లాభం ?

CK Babu joins in BJP in presence of Amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎప్పుడైతే చిత్తూరులో సీకే బాబు ఇంటికి వెళ్లారో అప్పుడు అనుకున్నదే జరిగింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక వెళ్లి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో సీకే బాబు కమలం కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో ఇదేమీ చిత్రం కాకపోయినా ఈ పరిణామం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోంది. బీజేపీ పరిస్థితిని పరిశీలించేముందు అసలు సీకే ఎందుకు బీజేపీలో చేరాడో చూద్దాం.

చిత్తూరు పట్టణంలో సీకే బాబు రాజకీయంగా పట్టున్నవాడే. అయితే అదంతా గతం. వై.ఎస్ ముఖ్య అనుచరుడిగా పేరు పడ్డ అతన్ని వైసీపీ కూడా దూరం పెట్టిందంటే అక్కడ ఆయన తాజా పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది. అధికార టీడీపీ, సీఎం చంద్రబాబు అంటే సీకే బాబుకి ఏ మాత్రం పడదు. ఆ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ పంచన చేరదామంటే జగన్ ఒప్పుకోడు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం అండ లేక రాజకీయ ఒంటరి తనం, జనంలో తగ్గిన పలుకుబడి, చుట్టుముడుతున్న పాత కేసులు, దూరం అవుతున్న అనుచరులు… ఈ పరిస్థితిలో సీకే బాబుకి రాజకీయ గొడుగు కావాలి. అది కూడా అధికార పక్షం అయితే ఇంకా బెటర్. ఆయన అనుకున్నట్టే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నేత ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించారు. దీంతో షా దగ్గరికి వెళ్లి సీకే బీజేపీ కండువా వేసుకున్నారు. బీజేపీ నేత అనే బ్రాండ్ తో సీకే కి కాస్త వెసులుబాటు. విభజన కి కాంగ్రెస్ లో పెత్తనం చేసిన నేతలు ఇలాగే వచ్చినప్పుడు బీజేపీ కండువాలు కప్పి వారిని అక్కున చేర్చుకుంది. దీంతో పార్టీ పెరిగిపోతుందని నమ్మింది. కానీ అప్పటికి ఇప్పటికీ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. బీజేపీ గొడుగు కిందకి చేరిన ఆ నేతలు మాత్రం హాయిగా అధికార పార్టీ బ్రాండ్ తో సేదతీరుతున్నారు.

ఇప్పుడు బీజేపీ గొడుగు కిందకి అలాంటి ఇంకో నేత సీకే వచ్చి చేరారు. ఈ చేరిక తో సీకే కి ఏమి ప్రయోజనం అన్నది పక్కనబెడితే బీజేపీ కి మాత్రం లాభం సున్నా. సీకే లాంటి ఇమేజ్ వున్న నేతల్ని చేర్చుకోవడం వల్ల చిత్తూరు లో ఆ పార్టీ సానుభూతిపరులు నోటి మీద వేలేసుకుంటున్నారు. సిద్ధాంతాలు పక్కనబెట్టి అధికారం కోసమే ఈ నిర్ణయాలు అని బీజేపీ అనుకుంటే అంతకన్నా తెలివితక్కువ తనం ఇంకోటి ఉండదు. ఇలాంటి వారిని చేర్చుకుంటే పార్టీ బలం పెరుగుతుంది అనుకుంటే వున్న కొద్ది మంది జనం కూడా దూరం అవుతారు, చంద్రబాబుని గిల్లి సంతోషపడదాం అనుకుంటే ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. ఇప్పుడు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తప్పు ఎప్పుడోసారి వెంటాడుతుంది. ఇదంతా అనవసరం అనుకుంటే ఒక్కసారి సీకే చుట్టుపక్కల వారిని అడిగి చూడండి ఆయన జీవితంలో ఎప్పుడైనా బీజేపీ గురించి ఒక్క మంచి మాట మాట్లాడారా అని. సీకే లాంటి నాయకులకి గొడుగు పట్టి బీజేపీ తనని తాను దిగజార్చుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అయినా అధికారంలో వున్నవారికి ఈ మాటలు చెవికెక్కుతాయా ?