బాహుబలి చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం తెరకెక్కుతుండే సరికి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. అయితే ఓ మోసగాడు రాజమౌళి ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి 50 లక్షలు దోచుకొని వెళ్ళడం చర్చనీయాంశమైంది.
వివరాలలోకి వెళితే వి నరేష్ కుమార్ అనే వ్యక్తి 73 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళా అడ్వకేట్‌కి తాను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలలో ఒకడని చెబుతూ, సినిమాలో మంచి రోల్ ఇస్తానని నమ్మబలికాడట. అంతేకాదు ఆమెకి నమ్మకం కలిగేలా రాజమౌళి వాయిస్‌తో ఫోన్లో మాట్లాడట. మొత్తం మీద ఆమెకి పూర్తి నమ్మకం వచ్చేలా చేసి 50 లక్షల మొత్తాన్ని తన ఎకౌంట్కి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతను కాల్స్‌కు సమాధానం ఇవ్వడం మానేయడంతో మహిళలకు అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించింది. టాస్క్ ఫోర్స్ ఈ కేసును విచారించి, నరేష్ మరియు మరో ఇద్దరు నిందితులని పట్టుకుని అదుపులోకి తీసుకుంది.