నగర వాసులకు శుభవార్త! ఇంటి నుంచి బయటకు వస్తే ఇంటర్నెట్ ఉండదనే దిగులు ఇకపై అక్కర్లేదు. నగరంలో మీరు ఏ మూలకు వెళ్లినా ఇంటర్నెట్ సదుపాయం మిమ్మల్ని అంటుకునే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హై-ఫై ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.
తెలంగాణ ప్రభుత్వ సహాకారంతో ప్రముఖ ఇంటర్నెట్ ప్రొవైడర్ యాక్ట్ నగరంలో 3,000 హాట్స్పాట్లను అందుబాటులోకి తేనుంది. నగరం నలుమూలలా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆగష్టు 4వ తేదిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఈ హాట్స్పాట్ సెంటర్లను ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2015లో హైదరాబాద్ నగరంలో వంద చోట్ల ఉచిత వైర్లెస్ ఫిడిలిటీ సర్వీసులను హై-ఫై పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ హై-ఫై సెంటర్ల దగ్గర ఎవరైనా గరిష్టంగా 5 ఎంబీపీఎస్ స్పీడ్తో అరగంట పాటు వైఫై సేవలను పొందే అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంగా ఈ సేవలను విస్తరిస్తూ వస్తోంది.
గతానికి భిన్నంగా ఈసారి పెద్ద తెలంగాణ ప్రభుత్వం, యాక్ట్ సంస్థలు కలిసి భారీ స్థాయిలో ఫ్రీ వై ఫై సెంటర్లను ప్రారంభిస్తున్నారు. నగరం నలుమూలలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే టూరిస్టులు, విద్యార్థులతో పాటు సామాన్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.