గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు వైమానిక దాడులు.. మరోవైపు భూతల దాడులతో గాజాలో మారణకాండ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ వ్యవహారంపై స్పందించారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల విధ్వంసం సమర్థనీయం అన్నారు. హమాస్‌తో ఎలాంటి సంబంధం లేని సామాన్య పౌరులపై ఇజ్రాయెల్ బాంబు దాడులు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులపై బాంబులకు బలవుతున్నారని వాపోయిన మేక్రాన్.. వీటిని ఆపేయాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు.
మేక్రాన్ ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ప్రపంచ దేశాలు ఖండిచాల్సింది హమాస్‌ను కానీ.. ఇజ్రాయెల్‌ను కాదని ఆయన స్పష్టం చేశారు. హమాస్ సామాన్య పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటూ.. తమ దేశంపై దాడులకు తెగబడుతోందని అన్నారు. ఇవాళ.. ఇజ్రాయెల్లో జరిగిన దాడులే రేపు పారిస్, న్యూయార్క్‌లలో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాజాలో సంభవిస్తున్న మరణాలకు పూర్తి బాధ్యత హమాస్‌దే కానీ ఇజ్రాయెల్‌ది కాదని నెతన్యాహు తేల్చి చెప్పారు.