ఏపీలో ‘అన్న క్యాంటీన్‌’ లు…ఐదు రూపాయలకే మూడు పూటలా !

full-meal-at-just-rs-5-at-anna-canteen-near-you-in-ap

గత సార్వత్రిక ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాటినన్నింటినీ నెరవేర్చే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. వాటిలో ఒకటయిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘అన్న క్యాంటీన్లు’ నేడు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని విద్యాధరపురంలోని ‘అన్న క్యాంటీన్‌’ను లాంచనంగా ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. త్వరలోనే మరో 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యంకానుంది. ప్రతీ రోజు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వ్యక్తికి గరిష్ఠంగా రెండు టోకెన్ల వరకు జారీచేసే అవకాశం ఉంది. ఆహార సరఫరా బాధ్యత ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘అక్షయపాత్ర’ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.