తెలంగాణ ముందస్తు ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అసలైన వ్యవహారాలన్నీ ముగిసిపోవడంతో, ఇక మిగిలిన ఘట్టం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచి, అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అంతే ధీటుగా మిగిలిన పార్టీలు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ నెలకొంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. అయితే కేసీఆర్ కు పోటీగా గజ్వేల్ బరిలో నిలిచిన ఓ పార్టీ అభ్యర్థి గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఆయన్ను వెతికి పట్టుకోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు పోలీసులను తాజాగా ఆదేశించడం సంచలనం రేపుతోంది. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్‌పై మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేస్తుండగా, మిగిలిన పార్టీల నుంచి కొందరు ముఖ్యనేతలు బరిలోకి దిగుతున్నారు. ఇదే జాబితా అంటే సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కే దినేశ్ చక్రవర్తి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన దినేష్ చక్రవర్తి 19న గజ్వేల్‌లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేశాడు.
అయితే, ఈ నెల 22న నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆయన కనిపించకుండా ఉంటున్నారు. దీని తర్వాత కొందరు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అంటుండగా, మరొకొందరు మాత్రం ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్నారు. దీనిపై తాజాగా ఎస్ ఎఫ్.బీ అధ్యక్షుడు మురళీధర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ వేసిన అనంతరం తమ అభ్యర్థి దినేష్ చక్రవర్తి కనిపించడం లేదని ఫిటీషన్ వేశారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక సీటులో నామినేషన్ వేయడంతోనే ఆయన గల్లంతు అయ్యారని ఆయన్ను వెంటనే వెతికిపెట్టేలా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు విన్నవించారు. విచారణ సమయంలో హైకోర్టు సైతం ఈ వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ అభ్యర్థిని కోర్టులో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దినేశ్ మాత్రం తమతో టచ్‌లోనే ఉన్నారని అదృశ్యం కాలేదని గజ్వేల్ సీఐ ప్రసాద్ తెలిపారు. కోర్టులో పిల్ దాఖలైన విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లామని, కోర్టుకు వస్తానని చెప్పాడని పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది.