Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో మరోసారి క్రియాశీలక పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిపై పట్టు పెంచుకునేందుకు గాలి జనార్ధన రెడ్డి కుటుంబం ప్రయత్నం చేయగా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఇటీవల వచ్చిన అమిత్షా గాలి జనార్దన్ రెడ్డితో తమ పార్టీకి సంబంధం లేదని మీడియాకు తెలిపారు. దీంతో ఇప్పుడు బిజెపి టికెట్ ఇవ్వకపోతే తాను మరో స్థానంలో పోటి చేసి తమ్ముడిని బళ్ళారి నుండి ఎలాగైనా గెలిపించుకుని తనకు సన్నిహితంగా ఉన్న బీజేపీ నేతల ద్వారా బిజెపి పై పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు.
ఒకవైపు జనార్ధన్ రెడ్డి తో తమకు సంబంధం లేదని అమిత్ షా ప్రకటించినప్పటికీ, అలా తెంచేసుకోవడం జరిగే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే గాలికి నమ్మిన బంటు అయిన శ్రీరాములుకు బీజేపీ వాళ్లు డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా యడ్యూరప్ప ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అభ్యర్థిగా బి. శ్రీరాములు తెరపైకి వచ్చాడు. ఈయన జనార్ధన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. అనుచరుడు. జైలుకి వెళ్ళిన గాలిని భారతీయజనతా పార్టీ వాళ్లు పట్టించుకోని టైం లో పార్టీ నుండి బయటకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుని బీజేపీని భారీగానే దెబ్బతీశాడు.
ఆ తర్వాత అమ్మ సుష్మ స్వరాజ్ (గాలి జనార్ధన్ రెడ్డి అలానే భావిస్తారు) మంత్రాంగం, పార్టీ పెద్దల బుజ్జగింపులతో శ్రీరాములు బీజేపీలోకి చేరాడు. ఇప్పుడు జనార్ధన్ రెడ్డి ఎటూ బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నాడు. అయితే జనార్ధన్ రెడ్డిని తిరిగి చేరదీస్తే… ఎన్నికల్లో తమకు మైనస్ అవుతుందేమో అని బీజేపీ భయపడుతోంది. ఎలాగు గెలిచాక పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడం అనేది గాలికి పెద్ద కష్టమయిన విషయమేమీ కాదు, దానికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తోంది.
గాలి రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన చిక్కబళ్లాపూర్ జిల్లా నుంచి బరిలోకి దిగనున్నారని సమాచారం. అంతేకాదు, చిక్కబళ్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూరు నియోజకవర్గం నుంచి తన భార్యను బరిలోకి దించి, బాగేపల్లి నియోజకవర్గం నుంచి తనకు అత్యంత ఆప్తుడైన నటుడు సాయికుమార్ ను బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. బాగేపల్లి నుంచి ఇప్పటికే ఒకసారి పోటీ చేసిన సాయికుమార్ ఓటమిపాలయ్యారు. తెలుగు లో కంటే కన్నడనాట ఆయనకి స్టార్ ఇమేజ్ ఉంది, అందుకే సాయికుమార్ అక్కడ చాలా సంవత్సరాల కిందటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితులని బట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన రంగంలోకి దిగారు.
బాగేపల్లి నుంచి గెలిచి అసెంబ్లీలోకి ఎంటరవుదామని భావించిన ఆయనకి అప్పుడు విజయం వరించలేదు. అయితే తనకి అత్యంత సన్నిహితుడు అయిన గాలి సూచనల మేరకి ఇప్పుడు మరోసారి సాయికుమార్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. బాగేపల్లి నుంచి రంగంలోకి దిగే ప్రయత్నంలో ఉన్నారట ఈ నటుడు. ముందుగా ఆయన బీజీపీ టికెట్ కోసం యత్నించడం కన్నడ రాజజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కాషాయ పార్టీ తరఫున పోటీ చేయడానికి స్థానిక నేతలు ప్రయత్నాల్లో ఉన్నా వారితో పాటు టికెట్ కోసం సాయికుమార్ కూడా పోటీలో ఉన్నారని సమాచారం. ఈయన అభ్యర్థిత్వం అయితే ఇంకా ఖరారు కాలేదు.
శ్రీ రాములు డిప్యూటీ సీఎం అభ్యర్ధి, ఒక ఎమ్మెల్యే గా సోమశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్యే గా జనార్ధన్ రెడ్డి, మరో ఎమ్మెల్యే గా గాలి భార్య, ఇంకో ఎమ్మెల్యే గా సాయి కుమార్ ఇలా మొత్తం ఒక వ్యూహంతో గాలి ముందుకి వెళుతున్నారు. జనార్ధన్ రెడ్డి గనుక వీరందరిని గెలిపించుకుని సత్తా చాటితే బీజేపీ లో ఆయన చక్రం తిప్పుతున్నాడనేందుకు ఇదే రుజువు అని కర్ణాటక రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సిఎం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని వారు విశ్లేషిస్తున్నారు.