వెంకటేశ్‌ అయ్యర్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

వెంకటేశ్‌ అయ్యర్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌పై భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెంకటేశ్ అయ్యర్‌కు వన్డే క్రికెట్‌ ఆడే మెచ్యూరిటీ లేదని, అలాంటి ఆటగాడిని కేవలం నాలుగు, ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాణించాడని టీమిండియాకు ఎంపిక చేస్తే ఇలాగే ఉంటుందని ఫైరాయ్యాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో వెంకటేశ్‌ అయ్యర్‌ ఆశించిన మేరకు రాణించకపోగా.. అతని స్థానం టీమిండియా గెలుపు అవకాశాలను ప్రభావితం చేసిందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

వెంకటేశ్‌ అయ్యర్‌ ఆటతీరును చూస్తే వన్డే క్రికెట్‌ ఆడేంత సీన్‌ లేదని స్పష్టంగా తెలుస్తుందని, అతన్ని వన్డే జట్టు నుంచి తప్పించి, టీ20 జట్టులో అవకాశం ఇచ్చి చూడాలని సెలెక్టర్లకు సూచించాడు. అలాగే అతన్ని వాడుకోవడంలో జట్టు కెప్టెన్‌ సైతం పూర్తిగా విఫలమయ్యాడని.. ఓపెనర్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణించిన ఆటగాడిని కేవలం మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ఎలా పరిగణిస్తారని, ఇది జట్టు కెప్టెన్‌ అనాలోచిత నిర్ణయమని ధ్వజమెత్తాడు.

మరోవైపు, ఐపీఎల్‌ అనేది టీమిండియాకు ఎంట్రీ ప్లాట్‌ఫామ్‌ కాదని, డబ్బులు తీసుకున్నప్పుడు ఫ్రాంచైజీకి పెర్ఫార్మ్‌ చేయాలనే ప్రతి ఆటగాడు ఆలోచించాలని, తాను ఐపీఎల్‌ ఆడే రోజుల్లో సహచర్లుకు ఇదే విషయాన్ని చెప్పేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా, వెంకటేశ్‌ అయ్యర్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున 10 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేసి ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో పాటు ఇటీవల జరిగిన విజయ్‌ హజారే ట్రోఫిలోనూ రాణించిన కారణంగా బీసీసీఐ అతన్ని టీమిండియాకు ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాతో రెండు వన్డేల్లో అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.