నిమజ్జన వేడుకల్లో అపశృతి

నిమజ్జన వేడుకల్లో అపశృతి

వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అప్పటివరకు బ్యాండ్‌ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపిన యువకుడు నిమజ్జనం అనంతరం వాగులో మునిగి మృతిచెందాడు. ఆదిలాబాద్‌రూరల్‌ ఎస్సై అంజమ్మ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణం అనుకుంటకు చెందిన దేవన్న–అక్కమ్మల కుమారుడు కన్నయ్య(22) బంగారుగూడ వాగులో గణేశ్‌ నిమజ్జనం అనంతరం కొంతమంది యువకులు కలిసి వాగులో స్నానం చేశారు.

వారితో పాటు కన్నయ్య కూడా స్నానం చేయగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు. స్నేహితులందరూ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గల్లంతయ్యాడు. తీరా శవమై తేలాడు. కన్నయ్యకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి గతంలో మరణించగా తల్లి కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చేతికొచ్చిన కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.