విజయవాడ నగరంలో దారుణం జరిగింది. దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీ ఉన్న రైల్వేస్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్ స్టేషన్ దగ్గరలో ఓ ప్రయాణికురాలిపై దుండుగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దుస్తులు చింపేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండుగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు నగ్నంగా రైల్వే ట్రాక్‌పై పరుగు పెట్టింది. ఈ దృశ్యాన్ని చూసి స్టేషన్‌లోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 50 ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఉప్పు చేపలు అమ్మేందుకు విజయవాడ వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచి చూస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెతో మాటలు కలిపారు. కాస్త పని ఉందని ఆమెని స్టేషన్ చివరి వరకు తీసుకెళ్లారు. అక్కడ రైల్వేట్రాక్ పక్కన ఆమె దుస్తులు చింపేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి వద్దనున్న డబ్బులు లాక్కెళ్లారు. దుండుగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నగ్నంగానే రైల్వేట్రాక్‌పై పరుగు పెడుతూ స్టేషన్ వద్దకు చేరుకుంది. రైళ్ల కోసం వేచిచూస్తున్న కొందరు ప్రయాణికులు ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఓ చీరను ఆమెకు కప్పి ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి మెడ, జననాంగాల్లో గాయాలయ్యాయి.