హథ్రాస్ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్న తరుణంలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. హరియాణాలోని గురుగావ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగుచూసింది. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు దుండగులు ఆమెను చిత్రవధ చేశారు. తలను గోడకేసి బాదడంతో ఆమెకు తీవ్ర గాయమైందని గురుగావ్ డీఎల్‌ఎఫ్-2 ఏసీపీ కరణ్ గోయల్ మీడియాకు చెప్పారు. నిందితుల్లో ముగ్గురు డెలివరీ బాయ్స్ కాగా..మరో యువకుడు రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నాడని వెల్లడించారు.
సికందర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బాధితురాలికి ఓ యువకుడు పరిచయమయ్యాడని, మాయమాటలు చెప్పి అతను రియల్ ఎస్టేట్ సంస్థ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లాడని తెలిపారు. అప్పటికే అక్కడ ముగ్గురు యువకులు ఉన్నారని, మొత్తం నలుగురు వ్యక్తులు యువతిపై అకృత్యానికి పాల్పడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. వారిని యువతి ప్రతిఘటించడంతో తలను గోడకేసి బాదారని వెల్లడించారు. అనంతం అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. గాయాలతో రోదిస్తున్న యువతి కేకలను సెక్యురిటీ గార్డు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడని చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారని ఏసీపీ వెల్లడించారు.