ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్ గ్రౌండ్లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్‌ను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి బారాబంకీ ప్రాంతంలో స్పెషల్ టాస్స్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా మరణించాడు. అయితే తొలుత తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానిక ఎస్పీ అరవింద్ చతుర్వేది వివరాలను వెల్లడించారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు.
టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కాగా మూడు వారాల క్రితమే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఓ కమిటీని సైతం నియమించింది.