టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి కారు చోరీకు గురైంది. తన ఇంటి ఆవరణలోని ఎస్‌యూవీ కారు దొంగతనానికి గురైందని గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ కారు చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఎంపీ ఇంట్లో కారు చోరీకి గురికావడాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.
ఢిల్లీ సెంట్రల్ డీసీపీ ఆధ్వర్యంలో పలు పోలీసు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూనే మరోవైపు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గౌతమ్ గంభీర్ తన తండ్రితో కలిసి రాజేంద్రనగర్‌లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
ఇక ఢిల్లీలో ప్రముఖల ఇళ్లే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు కూడా చోరీకి గురైన విషయం తెలిసిందే. తన బ్లూ కలర్ వాగనార్ కారు చోరీకి గురవడంపై సీఎం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేజ్రీవాల్ పలుసందర్బాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించడంతో కథ సుఖాంతమైంది.