మోహన్ బాబు ‘గాయత్రి ‘… తెలుగు బులెట్ రివ్యూ

Gayatri Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    మోహన్ బాబు, విష్ణు, శ్రియ , అనసూయ
నిర్మాత:    మోహన్ బాబు 
దర్శకత్వం :    మదన్
సినిమాటోగ్రఫీ:   సర్వేశ్ మురళి 
ఎడిటర్ :   ఎం.ఎల్.వర్మ
మ్యూజిక్ :   తమన్ 

విలక్షణ నటుడు మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత చేసిన సినిమా గాయత్రి. సినిమాగురించి మొదటినుంచి గొప్పగా చెబుతూ వచ్చారు. ఇక టీజర్ , ట్రైలర్ వచ్చాక అందులో డైలాగ్స్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచాయి. ఇక హీరో విష్ణు కూడా ఈ సినిమాలో యంగ్ మోహన్ బాబు పాత్ర చేస్తున్నాడు అనగానే ఏదో విషయం ఉందనిపించింది. ఇన్ని రకాలుగా ఆసక్తి రేపిన గాయత్రి సినిమా ఎలా వుందో చూద్దామా.

కధ …

దాసరి శివాజీ ( మోహన్ బాబు ) ఓ రంగస్థల నటుడు. శారద నిలయం పేరుతో అనాధ పిల్లల కోసం ఓ ఆశ్రమం నడుపుతుంటాడు. దాని పోషణ కోసం మారు వేషాలు వేసి శిక్షలు పడ్డ దోషుల బదులుగా జైలుకు వెళ్లి వస్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో అనాథలను పోషించడానికి ఓ కారణం ఉంటుంది. అతని కూతురు ఓ అనాధ ఆశ్రమంలో పెరుగుతుందని తెలియడమే. అయితే అది ఏ ఆశ్రమం , ఆ అమ్మాయి ఎవరు అనేది శివాజీకి తెలియదు. తీరా ఆ అమ్మాయి ఎవరో తెలిసే సరికి ఆమె తండ్రిని అసహ్యించుకుంటుంది అని తెలుస్తుంది. ఆ సందర్భంలో శివాజీ కిడ్నాప్ జరుగుతుంది . ఓ హత్య కేసులో అతను ఉరిశిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కూతురుని చంపుతానని బెదిరిస్తూ గాయత్రి పటేల్ ( మోహన్ బాబు ) అనే దుర్మార్గుడు శివాజీని ఇందులో ఇరికిస్తాడు . అసలు శివాజీని గాయత్రి పటేల్ ఎందుకు టార్గెట్ చేస్తాడు . చివరకు శివాజీ జీవితం ఏమి అవుతుంది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ …

”గాయత్రి “ సినిమా ములాకధలో తండ్రికి దూరం అయిన కూతురు , మనిషిని పోలిన మనిషి వంటి పాయింట్స్ బలంగా వున్నాయి. అయితే ఈ పాయింట్స్ ని అల్లుకునేందుకు శిక్ష పడ్డ ఖైదీలకు బదులుగా జైలుకు వెళ్లడం అనే పాయింట్ చాలా వీక్ పాయింట్. ఇది ఇప్పటి పరిస్థితులకు ఏ మాత్రం సరిపోని పాయింట్. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో ఎలాంటి వాడికైనా అలా చేసే ఛాన్స్ ఉండదు. దీంతో ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న సినిమా అంతా ఏదో ఆలా నడుస్తుంది అనిపిస్తుంది తప్ప ఎక్కడా మనసుని టచ్ చేయదు. నిజంగా ఇలాంటి పరిస్థితి వుంది అనుకుంటే అందుకు టెక్నాలజీ సాయం కావాలి. ఆ కోణంలో దర్శకుడు ఎక్కడా ఆలోచించలేదు. పాత సినిమాల్లో గడ్డం , మీసాలు మార్చుకుని పక్క వారిని బురిడీ కొట్టించినంత తేలిగ్గా హీరో పోలీసులు , జైలు అధికారుల్ని ఏ మార్చడం లో లాజిక్ బలంగా లేకపోవడంతో మొత్తంగా కధ తేలిపోయింది. సినిమా కధనంలో కొన్ని మంచి ట్విస్ట్స్ రాసుకున్నప్పటికీ వాటిని తెర మీద చూపించడంలో దర్శకుడు తేలిపోయాడు. కథ , కధనాలు ఎప్పుడో 20 , 30 ఏళ్ళ నాటి సినిమాలు గుర్తుకు తెప్పించేలా వున్నాయి. ఇలాంటి కూతురు సెంటిమెంట్ కథలంటే మోహన్ బాబుకు చాలా ఇష్టం అనుకుంటా. అప్పట్లో మలయాళం నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన కంకణం సినిమా హిట్ అయ్యాక కూడా దాని రైట్స్ తీసుకుని ఖైదీ గారు తీశారు. రాయుడు కూడా కూతురు సెంటిమెంట్ ఆధారంగా తీసిందే. ఇప్పుడు గాయత్రి అదే రూట్లో వచ్చి అలాగే నిరాశపరిచింది.

ఈ సినిమా మొత్తాన్ని మోహన్ బాబు ఒంటి చేత్తో నడిపించారు . కథ , కధనాలు పేలవంగా అనిపించినా తన నటన , డైలాగ్స్ తో కొంతవరకు ఆ లోపాన్ని బయటపడకుండా చూసారు. అయితే ముందుకు వెళ్లే కొద్దీ ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి. శివాజీ , గాయత్రి పటేల్ పాత్రల్లో మోహన్ బాబును చూసాక ఆయన పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే కథల ఎంపిక విషయంలో కొత్త తరం మీద నమ్మకం ఉంచితే బాగుంటుంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కుమార్తె పాత్ర చేసిన నిఖిల విమల్, శ్రియ తో పాటు అనసూయ కూడా బాగా చేసింది. యంగ్ మోహన్ బాబుగా విష్ణు చేసిన పాత్ర కూడా బాగున్నా సినిమాకు ఆయన అవసరం , ఆయనకు సినిమా అవసరం లేదు అనిపిస్తుంది. ఇక బ్రహ్మానందం, అలీ పాత్రలు కూడా పాత తరహాలోనే ఉంటాయి.

ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మోహన్ బాబు నటనతో పాటు అక్కడక్కడా పేలిన డైలాగ్స్. అమరావతి భూసేకరణ , నేను అభివృద్ధి చేస్తుంటే ఇంకొరికి ఓట్లు వేస్తారా అన్న చంద్రబాబు కామెంట్స్ మీద ఇన్ డైరెక్ట్ సెటైర్స్ పడ్డాయి. అయితే కధకు వీటితో సంబంధం లేకపోవడంతో పెద్దగా బుర్రలోకి ఎక్కవు. పెళ్ళైన కొత్తలో లాంటి సినిమాకు దర్శకుడు , ఆ నలుగురు కధకుడు మదన్ ఇలాంటి సినిమా తీసాడు అంటే మనసు ఒప్పుకోవడం లేదు.
ప్లస్ పాయింట్స్ ..
మోహన్ బాబు , శ్రియ , నిఖిల విమల్ నటన
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ ..
రొటీన్ కథ,కధనాలు
దర్శకత్వం
తెలుగు బులెట్ పంచ్ లైన్ …గాయత్రి పేరులో వున్న శక్తి సినిమాలో కూడా ఉంటే బాగుండేది.
తెలుగు బులెట్ రేటింగ్ …2 .5 / 5 .