పైరసీ..పైరసీ అంటూ చిత్ర పరిశ్రమ ఎంత మొత్తుకున్నా దాన్ని ఆపడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాలు వెంటనే మార్కెట్ లో సీడీలుగా కనిపించడం చూసాం. కానీ ఇప్పుడు పైరసీ దొంగలు ఇంకో అడుగు ముందుకు వేశారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గీతగోవిందం సినిమాని రిలీజ్ కూడా కాకముందే మార్కెట్ లోకి తెచ్చారు. అమరావతి సమీపంలోని కే.ఎల్. యూనివర్సిటీ లో ఓ విద్యార్థి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ , సీడీ రూపంలో ఈ సినిమా సర్క్యూలేట్ అవుతున్నట్టు పోలీసులు కనిపెట్టారు. ఆ విద్యార్థితో పాటు అతనితో ఈ వ్యవహారంలో సంబంధం ఉందని భావిస్తున్న మరికొందరిని కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమిక విచారణలో గీతగోవిందం సినిమా బయటకు రావడానికి ఆ చిత్ర ఎడిటింగ్ విభాగంలో పని చేసిన వారి దగ్గర నుంచే బయటకు వచ్చిందని తెలుస్తోంది.
గీతగోవిందం సినిమా విషయంలో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ విభాగం మరింత లోతైన విచారణ సాగిస్తోంది. ఈ సంగతి తెలిసిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ బాగా హర్ట్ అయినట్టు సమాచారం. పైగా ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ విభాగం వాళ్ళు ఎడిటింగ్ టీం లో ఎవరో ఒకరి దగ్గర నుంచి ఈ సినిమా బయటకు వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తుండటం తో అరవింద్ బాగా బాధపడుతున్నారట. తన దగ్గర పనిచేసే వాళ్లే ఇలా చేసి ఉంటారన్న ఆలోచన కూడా ఆయన తట్టుకోలేకపోతున్నారట.