Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహానటి సినిమా తర్వాత సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. సినిమాలో సావిత్రి, జెమినీగణేశన్ బంధాన్ని చిత్రీకరించిన విధానంపై ఇప్పటికే జెమినీ మొదటి భార్య కుమార్తె కమలా సెల్వరాజ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సావిత్రికి జెమినీ అంటే అసలు ఇష్టం లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సావిత్రి జీవితం పతనానికి జెమినీ గణేశన్ ను కారణంగా భావించడం సరికాదన్నారు. తాజాగా జెమినీ సన్నిహితుడు, సీనియర్ నటుడు రాజేశ్ కూడా దీనిపై స్పందించారు. సావిత్రి జీవితం అలా అయిపోవడానికి ఆమె స్వీయ తప్పిదాలే కారణమని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. జెమినీ గణేశన్ కు వివాహం అయిన సంగతి సావిత్రికి ముందే తెలుసు. అయినా ఆమె ఆయన్ని ప్రేమించింది. పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం నైతికత కాదన్నది ఆమెకు తెలియదా…? అని రాజేశ్ ప్రశ్నించారు.
జెమినీ గణేశన్ ను వివాహం చేసుకోవడమన్నది సావిత్రి తన జీవితంలో తీసుకున్న సరిదిద్దుకోలేని తప్పుడు నిర్ణయమని రాజేశ్ అభిప్రాయపడ్డారు. అలాగే జెమినీ గణేశన్ లైఫ్ స్టయిల్, ఆయన ప్రవర్తన ప్రత్యేకంగానే ఉండేవి. అవి తెలిసి కూడా సావిత్రి ఆయనకు దగ్గరయ్యారు. అది ఆమె తప్పు అని రాజేశ్ చెప్పుకొచ్చారు. సావిత్రి చాలా మందితో సంబంధాలు నడిపారన్న కమలా సెల్వరాజ్ ఆరోపణలపైనా రాజేశ్ స్పందించారు. సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదని, అయితే ఎంజీఆర్ తో ఆమె నటించకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయన్న విషయం మాత్రం తెలుసని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్ కు సావిత్రి అంటే ఇష్టమని, ఆమెతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన వారిని బెదిరించేవారని, దాంతో ఎంజీఆర్ పై అందరిలో చెడు అభిప్రాయం కలిగిందని రాజేశ్ చెప్పారు.
సావిత్రి కోసం తాను ఇదంతా చేస్తున్నానని ఎంజీఆర్ ఎవరితో చెప్పలేదని, అయితే ఏ కారణం చేతో సావిత్రి ఎంజీఆర్ తో నటించడానికి ఇష్టపడేది కాదని రాజేశ్ వెల్లడించారు. సావిత్రి మద్యానికి బానిస కావడం గురించీ రాజేశ్ ప్రస్తావించారు. సావిత్రికి జెమినీ గణేశనే మద్యం అలవాటు చేసినట్టు సినిమాలో చూపించడం గురించి మాట్లాడిన రాజేశ్ ఆ విషయాన్ని మరోకోణంలో విశ్లేషించారు. సమాజంలో హోదా ఉన్న ఓ వ్యక్తి నన్ను తాగమని బలవంత పెడితే నేను తప్పకుండా తాగుతాను. మోడ్రన్ కల్చర్ లో అదో భాగం. జెమినీ గణేశన్ కూడా సావిత్రిని అలానే ప్రోత్సహించారు. కానీ ఆమె తాగుడికి బానిసైపోయారు. అది కూడా ముమ్మాటికీ సావిత్రి తప్పే అని రాజేశ్ విశ్లేషించారు.