1970 దశకం నాటి చరిత్ర మరచిన విద్యార్థి నాయకుడి కథే ఈ జార్జిరెడ్డి. ‘నిజం చచ్చిపోయేలోపే మీ గళం విప్పండి’ అంటూ గొంతెత్తి.. వివక్షకు గురౌతున్న విద్యార్థుల తరఫున పోరాడి 25 ఏళ్ల వయసులోనే శత్రువుల చేతుల్లో ప్రాణాలు వదిలిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి.
చిన్నప్పట్నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు. పోరాడతాడు. కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడాడు.
జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. అతడి మేధోసంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు.
అయితే యూనివర్శిటిలో పేద, ధనిక వివక్ష ఎక్కువగా ఉండటంతో తన స్నేహితులు దస్తగిరి(పవన్), రాజన్న(అభయ్)లతో కలిసి తిరగబడతాడు. అతి తక్కువ కాలంలోనే విద్యార్ధినేతగా ఎదుగుతాడు. అయితే అప్పటికే యూనివర్సిటీలో ఏబీసీడీ అనే స్టూడెంట్ యూనియన్‌తో పాటు మరో యూనియన్ మధ్య వర్గపోరు నడుస్తుంటుంది. ఏబీసీడీ ఉద్యమ నేతగా సత్య (సత్యదేవ్) వరుసగా మూడుసార్లు ప్రెసిడెంట్‌గా ఎన్నికై నాలుగో సారి తన శిష్యుడు అర్జున్ (మనోజ్ నందం) పోటీలో నిలబెడతాడు. అయితే అదే ఏడాది పీఎస్ అనే విద్యార్ధి యూనియన్ను స్థాపించిన జార్జిరెడ్డి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. జార్జిరెడ్డిలో ఉన్న విప్లవ భావాన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది మాయ (ముస్కాన్). విద్యార్ధినాయకుడిగా ఎన్నికైన తరువాత యూనివర్శిటీలో ర్యాగింగ్‌తో పాటు, ఔటర్స్ ఆదిపత్యాన్ని తిప్పికొడతాడు జార్జ్.
మరోవైపు స్థానిక నేతల అండతో లక్ష్మణ్ (శతృ) యూనివర్శిటీలో గూండాగిరి చేస్తాడు. అతని తమ్ముడు (లలన్) అమ్మాయిల్ని ఏడిపిస్తూ ర్యాగింగ్ చేస్తుండటంతో జార్జిరెడ్డి అతనికి బుద్ధి చెబుతాడు. అతనితో పాటు ఔటర్స్ని క్యాంపస్‌లో అడుగుపెట్టనీయకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ చితక్కొడతాడు. ఇలా జార్జిరెడ్డి విద్యార్ధి నాయకుడిగా క్యాంపస్ గోడలు దాటి.. ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెడతాడు. ప్రభుత్వంపై తిరగబడతాడు. అతనికి ఓయూ విద్యార్ధులే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధి సంఘం నేతలు, నక్సలైట్స్ కూడా మద్దతు ప్రకటిస్తారు. ఇలా విద్యార్ధినేత నుండి విప్లవవీరుడిగా మారిన తరుణంలో జార్జిరెడ్డిని క్యాంపస్‌లోనే దారణంగా చంపేస్తారు. జార్జిరెడ్డిని చంపింది ఎవరు? వెన్నుపోటు పొడిచిందెవరన్నదే మిగతా కథ.
25 ఏళ్ల వయసులో పోరాటయోధుడిగా.. బాక్సింగ్ ఛాంపియన్‌గా.. మేధావి అయిన విద్యార్ధిగా ‘జార్జిరెడ్డి’ పాత్రను దర్శకుడు ఊహించుకున్నప్పుడు ఇన్ని వేరియేషన్స్‌లో పాత్ర చేయాలంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. కాని ఇలాంటి పాత్రలో పర్ఫెక్షన్ మిస్ కాకుండా పరకాయ ప్రవేశం చేశాడు హీరో సందీప్ మాధవ్. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు జీవన్ రెడ్డి (దళం ఫేమ్) ఎంత హోం వర్క్ చేశాడో తెరపై ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. సుమారు 5 నెలల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి అక్కడి నేటివిటీని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
అయితే ‘జార్జిరెడ్డి’ విద్యార్ధినేతగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు బలమైన సీన్లు ఉంటే బాగుండేది. ఒరిజినల్ కథకు కమర్షియల్ హంగులు జోడించి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉంచిన దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలోనే ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే చాలా రేసీగా అనిపించింది.. సెకండాఫ్‌కి నెమ్మదించింది. క్యాంపస్‌లో ఎక్కడ అన్యాయం జరిగినా హీరో మాదిరి వెళ్లి తుక్కు రేగ్గొట్టే సీన్లు పదే పదే ఉండటం.. ఉద్యమ తాలూకా బలమైన సీన్లు లేకపోవడం సినిమాకు ప్రధానమైన లోటు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ పెట్టాలని పెట్టినట్టుగా అనిపించింది.
జార్జిరెడ్డి జీవితం అర్ధాంతరంగా ముగిసింది కాబట్టి.. సినిమాలోనూ అతనితో జర్నీ చేసిన పాత్రల్ని సైతం అలాగే అర్ధాంతరంగా ఎండ్ చేశాడు దర్శకుడు. అయితే కొన్ని పాత్రల్ని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ అసంపూర్తిగా వదిలేశాడు. సత్యదేవ్, టీఎన్ఆర్, గాయిత్రి గుప్తా పాత్రలతో పాటు కథలో జార్జిరెడ్డి హత్యలో స్థానిక నేతల పాత్ర ఎంత అన్నది చూపించలేకపోయారు. బ్యాక్ డ్రాప్లో చాలా మంది రాజకీయ నాయకుల్ని చూపించారు కాని.. వాళ్లకు జార్జిరెడ్డికి ఉన్న సంబంధాన్ని టచ్ చేయలేకపోయారు. ఆ పాత్రలు ఎందుకు వస్తాయో తెలియని పరిస్థితి.
ఇక హీరోయిన్ ముస్కాన్.. మాయ పాత్రలో ఆకట్టుకుంది. వన్ సైడ్ లవర్‌గా ఉన్నంతలో పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. జార్జి తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక ఎమోషన్స్ బాగా పండించింది. తల్లీకొడుకుల ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్, పటాస్ యాదమరాజులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. పటాస్ యాదమరాజు తెలంగాణ యాసలో పేల్చిన పటాస్‌లు పేలాయి. అతని తండ్రికి జార్జి షర్ట్ ఇచ్చే సీన్ హైలైట్ అయ్యింది.
ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేష్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్. హీరోయిజం ఎలివేట్ చేయడంలో అతని బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్లకు మరింత బలాన్ని ఇచ్చింది. సాంగ్స్ కూడా సందర్భానుసారంగా ఉన్నాయి. మంగ్లీ పాడిన ‘వాడు నడిపే బండి’ పాట బాగుంది. మరాఠి సినిమా ‘సైరత్’ కు ఫొటోగ్రఫీని అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు పనిచేయడంతో ఆయన కెమెరా పవర్‌ను మరోసారి ‘జార్జిరెడ్డి’తో చూపించారు. ముఖ్యంగా ఫైర్ ఫుడ్ బాల్, బ్లేడ్ ఫైట్లతో అతని కెమెరా పనితనం అద్భుతం. ఉస్మానియా సెట్‌ను రియలిస్టిక్‌గా చూపించారు. చిన్న సినిమానే అయినప్పటికీ నిర్మాత అప్పిరెడ్డి నిర్మాణ విలువలు గ్రాండ్‌గా అనిపిస్తాయి. రన్ టైం మరీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.. సెకండాఫ్‌లో కత్తెర పడాల్సిన సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి.