Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతా అనుకున్నట్టే ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కేసారు. ఆమెతో పాటు కొందరు సర్పంచ్ లు, ఇతర కింది స్థాయి నేతలు కూడా వైసీపీ కి గుడ్ బై కొట్టి టీడీపీ గూటికి చేరారు. విశాఖ ఏజెన్సీలో ఈ పరిణామం జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎందుకంటే… ఇదే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత జగన్ ను వెనుకేసుకొచ్చి ఎంతో దూకుడుగా వ్యవహరించేవారు. ఒకానొక సమయంలో ఆమె అవసరం అయితే చంద్రబాబును తెగనరుకుతాం అన్న వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ పట్ల అంత అభిమానం, చంద్రబాబు మీద అంత కోపం వున్న నాయకురాలు సైతం ఇప్పుడు టీడీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముందుకు వచ్చినా వైసీపీ లో ఆత్మశోధన లేదు.
నిజానికి గిడ్డి ఈశ్వరి సైతం వైసీపీ లో కొనసాగుతూనే తన ప్రాధాన్యం కాపాడుకోవాలని ఓ వారం కిందట దాకా ప్రయత్నించారు. అయితే ప్రాధాన్యం అని కోరుకునే మనిషి మాకు అక్కర్లేదన్న తీరులో విశాఖ వ్యవహారాలు చూస్తున్న విజయసాయి వ్యవహరించారు. ఇక పార్టీలో కొనసాగమని కోరిన ఇతర నాయకులు సైతం ఈశ్వరికి ఏ భరోసా ఇచ్చే సాహసం చేయలేకపోయారు. నిన్న సాయంత్రం చివరి ప్రయత్నంగా గిడ్డి ఈశ్వరిని కలిసిన విశాఖ జిల్లా వైసీపీ నేత కరణం ధర్మశ్రీ సైతం ఏ హామీ ఇవ్వలేకపోయారు.
గిడ్డి టీడీపీ లో చేరడానికి కారణాలు తెలిసి కూడా వైసీపీ ఆమెను సైతం ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అన్న గాటన కట్టేసింది. 25 కోట్లు ఎర వేసి ఈ కొనుగోలు జరిపారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ వ్యాఖ్యల మీద గిడ్డి త్వరలో కౌంటర్ ఇచ్చే ఛాన్స్ వుంది. అప్పుడు ఆమె చెప్పే విషయాలు , కక్కే నిజాలు వైసీపీ ని ఇంకా డిఫెన్స్ లో పడేయడం ఖాయం.