Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అత్యాచార బాధితులకు సమాజం అండగా నిలవాలి. బాధితురాళ్లు ఆ బాధ నుంచి, అవమానం నుంచి బయటపడేందుకు చేయూతనందించాలి. భావి పౌరులను తయారుచేసే పాఠశాలలు ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ మహారాష్ట్రలోని లాథూర్ లో ఓ స్కూల్ యాజమాన్యం మాత్రం ఓ అత్యాచార బాధితురాలి విషయంలో అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది.
స్థానిక పాఠశాలలో ఇంటర్ చదువుతున్న పదిహేనేళ్ల విద్యార్థినిపై ఇటీవల ఆర్మీ సిబ్బంది ఒకరు అత్యాచారానికి ఒడిగట్టాడు. పెళ్లిచేసుకుంటానని ఆ బాలికను నమ్మించి అత్యాచారం జరిపాడు. దీనిపై పోలీసు కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో బాలిక పాఠశాలకు తిరిగి వెళ్లగా సోమవారం స్కూల్ సిబ్బంది అడ్డుకున్నారు. స్కూల్ లో తన అడ్మిషన్ రద్దుచేశారని చెప్పారు. దీనిపై బాలిక తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. తాను అక్కడ చదువుకుంటే స్కూల్ పేరు దెబ్బతింటుందని, అందుకే అడ్మిషన్ ను రద్దుచేస్తున్నామని పాఠశాల యాజమాన్యం చెప్పినట్టు బాలిక వెల్లడించింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాలికను యథావిధిగా పాఠశాలకు రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.