కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోతున్నానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… నాగర్కర్నూల్ పోచంపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు లక్ష్మి, వానదేవుడు దంపతులు మాదాపూర్లోని అయ్యప్పసొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బొల్లిపోగు స్నేహ (19) చదువుకుంటోంది.
నెల రోజుల క్రితం తండ్రికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పటి నుంచి స్నేహ మానసిక వేదనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబానికి ఆరి్థకంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి స్నేహ బలన్మరణానికి పూనుకుంది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.