మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్క కొడుకు కరిముల్లా అల్లరి చేశాడని ఆషా చీపురు కట్టతో కొట్టింది. అంతటితో ఆగక పట్టరాని కోపంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి బాలుడి చేతిని గాయపరిచింది. భీతిల్లిన కరిముల్లా కాపాడండంటూ పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఆడుకుంటున్న కరిముల్లా సోదరి కరీమున్ ప్రాణభయంతో తనతోపాటు మిగిలిన ముగ్గురు పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ బిగించింది. కేకలు విన్న ఇంటి యజమాని భార్య మెట్లెక్కి పైకి రావడాన్ని గమనించిన ఆషా.. చాకును చూపించి చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె భయంతో కిందికి వచ్చి భర్తకు చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈలోగా ఇరుగుపొరుగును పిలిచి ఘటనాస్థలికి వెళ్లేసరికి బాబు గొంతును కోసి అక్కడి నుంచి పొత్తి కడుపు వరకు పూర్తిస్థాయిలో కోసి పేగుల్ని బయటకు తీయడాన్ని చూసి జనంలో వణుకు మొదలైంది. ఈలోగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆశా వద్ద ఉన్న చాకును అతి కష్టం మీద లాక్కుని ఆమెను ఇంటి బయటికి తీసుకురావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎ.భాస్కర్ ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి గడియ తీసి లోపల కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న నలుగురు పిల్లలను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.