అడవి పంది దాడిలో బాలిక మృతి

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చర్ల మండలం మారుమూల పూసుగుప్పలో జరిగిన ఘటనతో ఊరంతా తీవ్ర దుఖంలో మునిగిపోయింది. విప్పపూపు సేకరణకు వెళ్లిన బాలికపై అడవి పంది దాడి చేయడంతో కాళ్లు, చేతులకు తీవ్రగాయాలై బాలిక ప్రాణాలు కోల్పోయింది.

కాగా విప్పపూవు సేకరణకు వెళ్లిన బాలిక అడవి పంది దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ గ్రామానికి చెందిన సోడి గణపతి కుమార్తె కవిత, మరో ఇద్దరు బాలురతో కలిసి సమీపంలోని అటవీ ప్రాంతానికి విప్పపూవును సేకరించేందుకు వెళ్లింది. అలా చేస్తుండగా… వెనక నుంచి అమాంతం వచ్చి ఓ అడవి పంది ఒక్కసారిగా కవితపై దాడి చేసింది. పక్కన ఉన్న బాలురు దానిపై రాళ్లు విసరడంతో అడవి పంది పారి పోయింది.

అయితే అప్పటికే ఛాతి, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలైన బాలికను ఇద్దరు బాలురు ఓ యువకుడి సాయంతో గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కవిత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే బాలికపై దాడిచేసేప్పుడు అడవి పందికి బాణం గుచ్చుకొని ఉన్నట్టు చూసిన వ్యక్తులు వెల్లడిస్తున్నారు. కాగా బాలిక కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని అటవీ సంరక్షణ అధికారి శోభ జిల్లా అధికారులను ఆదేశించారు.