Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రక్తసంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్క, అన్న,తమ్ముడు, చెల్లి వంటి బంధాలు అపురూపమైనవి. ఒకే కుటుంబం లోని పిల్లలు చిన్నప్పటినుంచి కలిసి పెరుగుతూ ఎంతో ఆప్యాయత, అనురాగాలు పంచుకుంటారు . తమ చెల్లికో, తమ్ముడికో, అక్కకో చిన్న ఆపద వాటిల్లితే అలమటించిపోతారు. వారిని కంటికి రెప్పలా కాచుకుంటారు. పిల్లలు తమ రక్తసంబంధీకుల విషయంలో ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉంటారో బెంగళూరులో జరిగిన ఓ ఘటన మరోసారి రుజువుచేసింది. కర్నాటకకు చెందిన ఎనిమిదేళ్ల ఆర్తి…తన నాలుగేళ్ల తమ్ముడిని బొమ్మ కారులో కూర్చోబెట్టి ఆడిస్తోంది.
ఇంతలో అదుపుతప్పిన ఓ పొగరుబోతు ఆవు పరుగుతో వచ్చి ఆ అక్కా తమ్ముడిపై పడింది. వెంటనే అలర్టయిన ఆ ఎనిమిదేళ్ల పాప కారులోంచి తమ్ముడిని తీసుకుని చేతులతో పొదివి పట్టుకుంది. ఆగకుండా కుమ్ముతున్న ఆవు కొమ్మలును తమ్ముడికి తగలకుండా తన శరీరాన్ని అడ్డుపెట్టింది. రెండు మూడుసార్లు ఆ ఆవు ఆర్తిని పొడిచింది. అయినా ఆర్తి దైర్యంగానే ఆవునుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
ఇంతలో లోపలినుంచి పెద్దవారు వచ్చి ఆవును అదిలించడంతో అది వెళ్లిపోయింది. ఆవు దాడిలో స్వల్పంగా గాయపడిన ఆర్తి తమ్ముడికి మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా తప్పించింది. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి హఠాత్ సంఘటనలు జరిగినప్పుడు చాలామందికి మైండ్ పనిచేయదు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తోటివారిని ఎక్కడివారిని అక్కడ వదిలేసి పరుగులు తీస్తారు చాలామంది. ఆవు, గేదె వంటి జంతువులు ఇలా అదుపుతప్పి ప్రవర్తించినప్పుడు మరింత భయం కలుగుతుంది. కానీ అలాంటి భయానక పరిస్థితిలోనూ ఆవుబారి నుంచి ధైర్యంగా తమ్ముణ్ని రక్షించిన ఆర్తి సాహసంపై సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది.