ఇంక శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

ఇంక శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

మండల పూజలకోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు శనివారం సాయంత్రం తెరుచుకోనున్నాయి. మూడు రోజులు మినహా రెండు నెలల పాటు మకరు విలక్కు వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శబరిమల తంత్రి కందరారు మహేశ్ మోహనారారు ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఏడాది అయ్యప్ప ఆలయన ప్రధాని పూజారిగా ఏకే సుధీన్ నంబూద్రీ, మాలికాపురత్తమ్మ ప్రధాని పూజారిగా పరమేశ్వరన్ నంబూద్రీలుగా నిర్ణయించారు. ఈ ఇద్దరూ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటికే కేరళ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా చేరుకున్నారు. వీరంతా ప్రస్తుతం నిళక్కల్, పంబా పరిసరాల్లో ఉండగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత శబరిమలలోకి అనుమతిస్తారు.

మరోవైపు, గతేడాది సుప్రీంకోర్టు తీర్పు అమలుపై కేరళ ప్రభుత్వం న్యాయకోవిదుల సలహా తీసుకుంది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎటూ తేల్చకపోవడంతో కేరళలోని కమ్యూనిస్ట్ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. గతేడాది ఘటనలు పురావృతం కాకుండా ఉండాలంటే మహిళ ప్రవేశానికి అనుమతించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ ఉద్యమాలకు శబరిమల వేదిక కాదని, ప్రచారం కోసమే అయ్యప్ప సన్నిధానంలో ప్రవేశిస్తామనే వారికి ప్రభుత్వం ఏలాంటి భద్రత కల్పించదని కుండబద్దలుకొట్టారు.

అంతేకాదు, ఆలయంలోకి వెళ్లాలనుకొనే మహిళా ఉద్యమకారులకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పిస్తుందన్న వార్తల్లో నిజంలేదన్నారు. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కొంత అస్పష్టత ఉందని, కాబట్టి ఎవరైనా 10-50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి వెళ్లాలనుకుంటే కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై అస్పష్టత నెలకొందని, దీనిపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని కేరళ న్యాయమంత్రి తెలిపారు. అబద్ధాలను ప్రచారం చేసి, భక్తులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే శక్తులను క్షమించబోమని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉండగా ప్రచారం కోసం ఆలయ ప్రవేశం చేయాలనుకునే మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించకూడదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు మహిళలకు ఆలయ ప్రవేశ అవకాశం కల్పించకూడదని తీర్మానించారు. శబరిమలలో మహిళల ప్రవేశం అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినందున గత ఏడాది తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వానికి అటార్నీ జనరల్‌ కె.వేణుగోపాల్‌ న్యాయ సలహా ఇచ్చారు.