నాలుగేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే యువతి తల్లికి, అన్నయ్యకు ఈ వివాహం ఇష్టం లేదు. అప్పట్లో యువతికి మైనార్టీ కూడా తీరలేదు. దీంతో పోలీసుల వద్ద పంచాయతీ కూడా జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి మైనార్టీ తీరడంతో ప్రేమికులు ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి యువతి తమ్ముడితో కలిసి కారులో పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తుండగా యువతి అన్నయ్య మోటార్ సైకిల్‌పై కారును అడ్డగించాడు.
కారులో ఉన్న ప్రేమికుడిని అక్కడ ఉన్న టెలిఫోన్ స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన పాలకొల్లు మండలం దిగమర్రు వద్ద గురువారం జరిగింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం సీతారామపురం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుతోటకు చెందిన నేతల విలియం రాజు నరసాపురంలోని ఓ కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు.
అదే పేటకు చెందిన నల్లి లావణ్య మణి, విలియం రాజు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ కుటుంబ పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని కోరారు. లావణ్యమణికి తండ్రి లేరు. తల్లి, అన్నయ్య సంతోష్, తమ్ముడు జాన్ ఉన్నారు. తల్లి, అన్నయ్య సంతోష్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం పెళ్లి చేసుకునే నిమిత్తం విలియంరాజు, లావణ్యమణి తన తమ్ముడు జాన్‌తో కలిసి కారులో వస్తుండగా దిగమర్రు వద్ద కారును లావణ్య మణి అన్నయ్య సంతోష్ మోటార్ సైకిల్‌తో అడ్డగించి కారులో ఉన్న విలియం రాజును బయటకు లాగి పిడిగుద్దులు గుద్దాడు.
అక్కడే ఉన్న స్తంభానికి విలియంరాజును కట్టేసి దాడి చేశారు. స్థానికులు అడ్డుకుని పాలకొల్లు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పి.అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్లతో కట్టేసి గాయాలతో ఉన్న విలియంరాజును విడిపించి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విలియంరాజు ఫిర్యాదు మేరకు సంతోష్‌పై కేసు నమోదు చేశారు. సంతోష్ తమ్ముడు జాన్‌కి కూడా స్వల్పగాయాలయ్యాయి. పాలకొల్లు రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.