జగన్ కు నివేదికను ఇవ్వనున్న జీఎన్ రావు కమిటీ సభ్యులు

జగన్ కు నివేదికను ఇవ్వనున్న జీఎన్ రావు కమిటీ సభ్యులు

ఏపీ రాజధాని భవిష్యత్తును తేల్చే నిపుణుల కమిటీ నివేదిక ఈరోజు సీఎం జగన్ కు అందబోతుంది. ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం నివేదికను సీఎం జగన్ కు అందించబోతున్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, విధి విధానాల గురించి సలహాలను, సూచనలను కోరుతూ సీఎం జగన్ రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని నియమించారు.

జీఎన్ రావు కమిటీ 13 జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను తయారు చేసింది. కమిటీ పూర్తి స్థాయి నివేదికను ఈరోజు జగన్ కు ఇవ్వనుంది. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ చేసిన ప్రకటనపై కర్నూల్, వైజాగ్ జిల్లాలలో నివశించే ప్రజలు హర్షం వ్యక్తం చేయగా అమరావతి ప్రాంతంలోని ప్రజల నుండి మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది.

సీఎం క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 3.30 గంటలకు జీఎన్ రావు కమిటీ జగన్ తో భేటీ కానుంది. రాజధానిపై, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై కమిటీ ఇప్పటికే పూర్తి అధ్యయనం చేసింది. కమిటీ నివేదికలో ఏం పొందుపరిచారో అని ఇటు ఏపీ ప్రజల్లో, రాజకీయ నేతల్లో కూడా టెన్షన్ నెలకొంది. కమిటీ మూడు రాజధానుల గురించి నివేదికలో పొందుపరిచితే అమరావతి, విశాఖ, కర్నూలు ఏపీ రాజధానులు అయ్యే అవకాశం ఉంది.