వినాయకుడి విగ్రహాలు పాలు తాగడం, వేప చెట్ల నుంచి పాలు కారడం, చెట్లు పడుకొని మళ్ళీ లేచి నిలబడడం లాంటి వార్తలు మనం వింటూనే ఉంటాం. అలాంటి వార్తే ఇది కూడా. బీహార్ లోని గయ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో వినాయక విగ్రహం నుంచి చెమటలు వస్తున్నాయన్న విషయం సంచలనం సృష్టించింది. గయలోని రాంశిల తకుర్బాదీ ఆలయం గర్భగుడిలో ఉన్న వినాయక విగ్రహం కొన్నిరోజులుగా తడిగా, చేతితో తాకితే చెమ్మ తగుతగిలేలా కనిపిస్తోంది దాంతో స్వామివారికి ఎండ వేడిమి కారణంగా చెమటలు పోస్తున్నాయంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియలో కూడా గట్టిగా ప్రచారం జరగడంతో గయ పరిసర ప్రాంతాల నుండి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. ఎండలు మండిపోవడంతో ప్రజలే కాకుండా దేవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడని అర్చకులు చెబుతున్నారు. అందుకే, గణేశుడి విగ్రహానికి చల్లదనం కలిగించేలా చందన పూతలు పూయడమే కాక, గర్భగుడిలో వేడిమి తగ్గించేందుకు రెండు ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి నిపుణులు మాత్రం భిన్నమైన స్వరం వినిపిస్తున్నారు. పగడపు రాయితో తయారైన విగ్రహాలు ఎప్పుడూ వేడిగా ఉంటాయని, వాతావరణంలో మరింత వేడి నెలకొన్నప్పుడు ఆ విగ్రహాల నుంచి తడి రావడం సాధారణం అని వారు చెబుతున్నారు.