స‌బ‌ర్మ‌తీ ఎక్స్ ప్రెస్ ద‌హ‌నం కేసుః దోషుల‌కు శిక్ష త‌గ్గింపు

Godhra burning case Conviction of 31 upheld, death sentence of 11 commuted to life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2002లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గోద్రా రైలు ద‌హ‌నం కేసులో గుజ‌రాత్ హైకోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. కేసులో 11 మంది దోషుల‌కు కింది కోర్టు విధించిన ఉరిశిక్ష‌ను జీవిత‌ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 27 2002న స‌బ‌ర్మతీ ఎక్స్ ప్రెస్ లోని ఎస్ -6 కోచ్ ని గోద్రా జంక్ష‌న్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో త‌గుల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 94 మందిపై కేసు న‌మోదుచేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం వారిపై ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది. కేసు విచార‌ణ సుదీర్ఘ‌కాలం సాగింది. 94 మందిలో 63మందిపై సాక్ష్యాలు లేని కార‌ణంగా వారిపై ఆరోప‌ణ‌ల‌ను సెష‌న్స్ కోర్టు కొట్టివేసింది. మిగిలిన 31 మందిని నేర‌స్థులుగా నిర్ధారించింది. వారిలో 11 మందికి మ‌ర‌ణ‌శిక్ష‌, మిగిలినవారికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే మ‌ర‌ణ‌శిక్ష ప‌డ్డ దోషులు తీర్ప‌పై హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు వారి శిక్ష‌ను కూడా యావ‌జ్జీవంగా మారుస్తూ తీర్పు వెల్ల‌డించింది. మృతుల కుటుంబాల‌కు ఆరువారాల్లోగా రూ. 10 ల‌క్ష‌లు చొప్పున న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. స‌బ‌ర్మ‌తి రైలు ద‌హ‌నం, ఆ త‌ర్వాత జ‌రిగిన గోద్రా అల్ల‌ర్లు దేశ చ‌రిత్ర‌లో చీక‌టి అధ్యాయంగా మిగిలిపోయాయి.

గోద్రా అల్ల‌ర్ల వెన‌క అప్ప‌టి బీజేపీ ప్ర‌భుత్వం ఉంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర‌మోడీని ప‌ద‌వినుంచి తొల‌గించాల‌ని కేంద్ర‌ప్రభుత్వంపై న‌లుమూల‌ల నుంచీ ఒత్తిడి పెరిగింది. ప్ర‌తిపక్షాల‌తో పాటు ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాలు సైతం మోడీ ప్ర‌భుత్వాన్ని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలని ప‌ట్టుబ‌ట్టాయి. కానీ…పార్టీలోని ప‌రిస్థితులు, ఆరెస్సెస్ ప్ర‌భావంతో అప్ప‌టి ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్ పేయి మోడీని తొల‌గించే క‌ఠిన నిర్ణ‌యం తీసుకోలేక‌పోయారు. గోద్రా అల్ల‌ర్ల త‌ర్వాత జ‌రిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌లను ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా గ‌మ‌నించింది. మోడీపై వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో గుజ‌రాత్ లో బీజేపీ ఓడిపోతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ అనూహ్యంగా మోడీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక ఆ త‌ర్వాత మోడీ బీజేపీలో తిరుగులేని నేత‌గా ఎదిగారు. చివ‌ర‌కు 2014లో ప్ర‌ధాని పీఠాన్ని అధిరోహించారు. ప్ర‌స్తుతం దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నేత‌గా మోడీకి గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న రాజ‌కీయ జీవితంలో గోద్రా ఘ‌ట‌న ఓ చెర‌గ‌ని మ‌చ్చ‌గానే మిగిలిపోతుంది.